పోటాపోటీగా మందు సప్లయ్.. చీప్ లిక్కర్కు భారీ డిమాండ్

 పోటాపోటీగా మందు సప్లయ్.. చీప్ లిక్కర్కు భారీ డిమాండ్
  • భారీగా కొనుగోలు చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు
  • సాయంత్రం వేళ అభ్యర్థుల ఇండ్ల వద్ద క్యూ
  • కిటకిటలాడుతున్న బెల్టు షాపులు
  • టోకెన్లతో పంపిణీ

నిర్మల్, వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచేందుకు మందు సప్లయ్​ ప్రధాన అస్త్రంగా మారింది. పోటీలో ఉన్నవారు పురుష ఓటర్లకు మందు సప్లయ్​పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సర్పంచ్, వార్డు మెంబర్లకు పోటీ చేసే అభ్యర్థులంతా పెద్ద మొత్తంలో చీప్ లిక్కర్ కొనుగోలు చేస్తున్నారు. చీప్ లిక్కర్ భారీ స్థాయిలో కొనేందుకు షాపుల యజమానులకు అడ్వాన్సులు చెల్లిస్తున్నట్లు సమాచారం.

గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపుల్లోనూ పెద్ద ఎత్తున మద్యం నిల్వ ఉంచుతున్నారు. కొంతమంది అభ్యర్థులు తమకు అనుకూలమైన ఓటర్లకు ప్రతిరోజు మద్యం పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. పలు చోట్ల బెల్ట్ షాపులకు టోకెన్లు జారీ చేస్తున్నారు. 

సర్పంచ్ అభ్యర్థుల ఇండ్ల వద్ద సందడి 

ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ సర్పంచ్ అభ్యర్థుల ఇండ్ల వద్ద సందడి ఎక్కువవుతోంది. సాయంత్రం వేళల్లో మద్యం కోసం మందుబాబులు అభ్యర్థుల ఇండ్ల వద్ద క్యూ కడుతున్నారు. తమ మద్దతుదారులు చేజారకుండా చూసుకునేందుకు మద్యం పంపిణీకే అభ్యర్థులు ప్రాధాన్యతనిస్తూ టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. అలాగే గ్రామాల్లోని హోటల్లు, చికెన్ సెంటర్లు కూడా బిజీగా మారుతున్నాయి. గ్రామాల శివారుల్లో ఏర్పాటైన డాబాలు కూడా సాయంత్రం వేళల్లో 
కిటకిటలాడుతున్నాయి.

యూత్ క్లబ్​లు, కుల సంఘాలకు గాలం

గ్రామాల్లో ఎన్నికల సమయంలో యూత్ క్లబ్​లు, కుల సంఘాలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. దీంతో సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థులంతా ఈ రెండు వర్గాల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. యూత్ క్లబ్స్​కు అవసరమైన క్రీడా సామగ్రి, ఫర్నీచర్ అందిస్తామని హామీ ఇస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వారికి టూర్ లు, విందు ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తున్నారు.

ఇప్పటికే పలు గ్రామాల్లో యూత్ క్లబ్ లకు అక్కడి సర్పంచ్ అభ్యర్థులు గోవా, ఊటీ టూర్  కోసం అడ్వాన్సులు కూడా చెల్లించినట్లు సమాచారం. చాలా గ్రామాల్లో కుల సంఘాలు ప్రభావం చూపనుండడంతో సర్పంచ్ అభ్యర్థులు ఆ సంఘాల మద్దతు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. నజరానాలతో పాటు విందులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.