V6 News

శ్రీశైలంలో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్న మహిళలు అరెస్ట్

శ్రీశైలంలో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్న మహిళలు అరెస్ట్

పవిత్ర పుణ్య క్షేత్రం శ్రీశైలంలో మద్యం కలకలం రేపుతోంది. భక్తి ముసుగులో కొందరు అక్రమ మద్యం దందాను సాగిస్తున్నారు. పుణ్యక్షేత్రం పవిత్రతను కాలరాస్తూ, గుట్టుచప్పుడు కాకుండా మద్యం, నాటుసారా అమ్ముతున్నారు. మహిళలు ముఠాగా ఏర్పడి ఈ దందా నడుపుతున్నారు. భక్తులను టార్గెగ్ చేసుకుని దండుకుంటున్నారు. పక్క సమాచారంతో శ్రీశైలం లో జరుగుతున్న మద్యం దందా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఏపీలోని ఆత్మకూరునుంచి మద్యం తీసుకొచ్చి శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అమ్ముతున్న మహిళలను మంగళవారం(ఏప్రిల్ 14) అరెస్ట్ చేశారు. వారినుంచి భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

శ్రీశైలం క్షేత్రానికి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఆత్మకూరుకు చెందిన ఐదుగురు మహిళలు బస్సులో అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి 314 క్వార్టర్ బాటిళ్లు, 24 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా ఈ దందాను సాగిస్తున్నట్లు గుర్తించారు.

పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. శ్రీశైలంలోని ప్రధాన హోటళ్లలో పని చేసే సిబ్బందిని ఈ మహిళలు టార్గెట్ చేసుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా బెగ్గర్సిని హోటల్ సిబ్బందికి వారు క్రమం తప్పకుండా మద్యం సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. శ్రీశైలంలోని పలుచోట్ల బాత్రూమ్స్ దగ్గర,మాణిక్యమ్మ సెల,ఆర్టీసీ బస్టాండ్,సిద్ధి రామప్ప కాంప్లెక్స్ పాయింట్ల దగ్గర మహిళలు మద్యం అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. 

దేవుని సన్నిధిలో మద్యం విక్రయించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులే టార్గెట్ గా మహిళలే సారా విక్రయాలకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఈ దందా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? మద్యం ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.