లిక్కర్ స్కాం డబ్బులు బీజేపీకే ముట్టినయ్: ఆతిశీ

లిక్కర్ స్కాం డబ్బులు బీజేపీకే ముట్టినయ్: ఆతిశీ

 ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ ప్రధాన కుట్రదారు అని, డబ్బులు కూడా హవాలా ద్వారా చేతులు మారాయన్న ఈడీ ఆరోపణలను ఆప్ ఖండించింది. శనివారం ఢిల్లీలో మినిస్టర్​అతిశీ మీడియాతో మాట్లాడారు. ‘‘అరబిందో ఫార్మా కంపెనీ ఓనర్ శరత్ చంద్రా రెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. నిజానికి ఆయనే బీజేపీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో డబ్బులు అందజేశారు” అని చెప్పారు.

 ‘‘కేజ్రీవాల్​ను తాను ఎన్నడూ కలవలేదని, ఆప్ తో ఎలాంటి సంబంధం లేదన్నందుకే ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆయన మాట మార్చారు. కేజ్రీవాల్ ను కలిశానని, లిక్కర్ పాలసీ గురించి మాట్లాడానని చెప్పిన వెంటనే బెయిల్ వచ్చింది. మరి స్కాంలో చేతులు మారాయంటున్న డబ్బులు ఎక్కడ?” అని ఆమె ప్రశ్నించారు.

 కాగా, ఢిల్లీలోని ఆప్ ఆఫీసును అన్ని వైపుల నుంచీ క్లోజ్ చేశారంటూ అతిశీ ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. అయితే, ఢిల్లీ ఆప్ ఆఫీస్ ను సీల్ చేశామన్నది నిజం కాదని పోలీసులు తెలిపారు. అక్కడ 144 సెక్షన్ మాత్రమే అమలులో ఉందన్నారు.