- సమస్తిపూర్ ఈవీఎంల నుంచి తొలగించారని ఆర్జేడీ ఆరోపణ
- మాక్ పోల్ స్లిప్పులుగా నిర్ధారించిన అధికారులు
సమస్తిపూర్: బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో శనివారం రోడ్డు పక్కన చెత్తకుప్పలో ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (వీవీప్యాట్) స్లిప్పులు కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్అయ్యాయి. అలాగే ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందనే అనుమానాలు రేకెత్తించింది. ఈ స్లిప్పులు ఈ నెల 6వ తేదీన పోలింగ్జరిగిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)ల నుంచి తొలగించినవే అని ఆర్జేడీ ఆరోపించింది. ఆర్జేడీ అభ్యర్థి రాకేశ్ కుమార్ సింగ్ మద్దతుదారులు రోజ్‌కోట్ ప్రాంతంలో ఈ స్లిప్పులు గమనించారు.
వెంటనే ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఓట్లు చోరీ అయ్యాయని, ఎన్నికల సంఘం చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఇవి మాక్ పోల్ స్లిప్పులు మాత్రమే అని సమస్తిపూర్ జిల్లా మేజిస్ట్రేట్ రాహుల్ కుమార్ వివరణ ఇచ్చారు. అసలు ఓట్ల స్లిప్పులు కావని తెలిపారు. మాక్ పోల్ తర్వాత ఈ స్లిప్పులు చెత్తలో పడేశారు.
ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. అధికారులు తనిఖీ చేసి మాక్ పోల్ స్లిప్పులు అని నిర్ధారించారు. మరోవైపు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ (ఏఆర్వో)పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఆదేశించారు. ఏఆర్వో ను సస్పెండ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీనిపై విచారించి వివరణాత్మక రిపోర్టును
సమర్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
