ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తగ్గిన లిక్కర్ షాపుల అప్లికేషన్లు, ఆదాయం!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తగ్గిన లిక్కర్ షాపుల అప్లికేషన్లు, ఆదాయం!
  • లిక్కర్​ షాపుల లైసెన్స్ దరఖాస్తుల తీరిది..

ఖమ్మం/భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ సారి లిక్కర్​ షాపుల కోసం దరఖాస్తుల సంఖ్య తగ్గింది. ప్రతీ అప్లికేషన్ కు ప్రభుత్వం రూ.3 లక్షల చొప్పున నాన్​ రిఫండబుల్ అమౌంట్ ను వసూలు చేస్తుండగా, శనివారం రాత్రి వరకు ఖమ్మం జిల్లాలో 3,998 దరఖాస్తులు దాఖలయ్యాయి. చివరి రోజున రాత్రి 9 గంటల వరకు 1,608 అప్లికేషన్లు వచ్చాయి. వీటితో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.119.94 కోట్ల ఆదాయం వచ్చింది.

 అయితే రెండేండ్ల కింద నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో 122 షాపుల కోసం మొత్తం 7,207 దరఖాస్తులు వచ్చాయి. దీంతో 2023లో అప్లికేషన్​ కు రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.144.14 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి అప్లికేషన్ల ద్వారా గతసారి కంటే రూ.24 కోట్ల ఆదాయం తక్కువగా వచ్చింది. అప్లికేషన్​ రేటు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచడంతో ఈసారి అప్లికేషన్ల సంఖ్య తగ్గినా, ఆదాయం మాత్రం రూ.150 కోట్లు సాధించాలనే లక్ష్యంతో జిల్లా ఎక్సైజ్​ అధికారులు పనిచేశారు. 

చాంబర్ ఆఫ్ కామర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వ్యాపారస్తులతో మాట్లాడి దరఖాస్తులు చేయించే ప్రయత్నం చేశారు. చివరి రెండ్రోజుల్లో అప్లికేషన్ల సంఖ్య పెరిగినప్పటికీ, గతసారి కంటే ఆదాయాన్ని మాత్రం పెంచలేకపోయారు. ఇక భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని 88 వైన్ షాపులకు దాదాపు 3,620 దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజే దాదాపు 1,660 వరకు దరఖాస్తులు వచ్చినట్లుగా ఆఫీసర్లు పేర్కొంటున్నారు. ఈసారి దరఖాస్తుల రూపంలో దాదాపు రూ. 100 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. గతంలో మొత్తం 5,057 దరఖాస్తులు వచ్చాయి. గతం మీద పోలిస్తే ఈసారి భారీగా దరఖాస్తులు తగ్గాయి.