ఈడీ కస్టడీకి లిక్కర్ వ్యాపారి అమిత్ అరోరా

ఈడీ కస్టడీకి  లిక్కర్ వ్యాపారి అమిత్ అరోరా

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో లిక్కర్ వ్యాపారి అమిత్ అరోరాను సీబీఐ స్పెషల్ కోర్టు 7 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది.  ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఈడీ అధికారులు బుధవారం అమిత్ అరోరాను అదుపులోకి తీసుకొని.. తర్వాత ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి నాగ్ పాల్ ముందు హాజరుపరిచారు. తొలుత ఈడీ తరఫు అడ్వకేట్ నవీన్ కుమార్ మిట్ట వాదనలు వినిపిస్తూ... అమిత్ అరోరాను 14 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించాలని కోరారు. కిక్‌‌ బ్యాక్ పాత్రలో అమిత్ అరోరా కీ రోల్ పోషించినట్లు తెలిపారు. అమిత్ అరోరా రూ.2.5 కోట్ల లంచం వసూలు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈడీ అడ్వకేట్ వాదనలపై అరోరా తరఫు లాయర్​అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే 22 సార్లు అరోరా ఈడీ ముందు హాజరయ్యారని, ఫోన్ కాల్​విచారణకు సహకరించారని తెలిపారు. ఈ వాదనలపై జోక్యం చేసుకున్న జడ్జి నాగ్​పాల్... 22 సార్లు విచారణల తర్వాత కస్టడీ అవసరమేంటనీ ఈడీని ప్రశ్నించారు. కేవలం మూడుసార్లు వాంగ్మూలం నమోదు చేసినట్లు ఈడీ తరఫు అడ్వకేట్​ కోర్టుకు తెలపగా, ఈడీ ఫోన్ చేసి పిలిచిన ప్రతిసారి విచారణకు హాజరయ్యారని అరోరా తరఫు లాయర్​ చెప్పారు. తన క్లయింట్ ఫోన్ కూడా మార్చలేదని తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు.. అమిత్ అరోరాను డిసెంబర్ 7 వరకు ఈడీ కస్టడీకి అనుమతించింది.