‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో కాత్సాయనిగా గుర్తింపును అందుకున్న శివానీ నాగారం నటించిన కొత్త చిత్రం ‘హే బలవంత్’. సుహాస్ హీరోగా గోపీ అచ్చర దర్శకత్వంలో బి.నరేంద్ర రెడ్డి నిర్మించారు. ఫిబ్రవరి 20న బన్నీవాస్, వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి, తన కెరీర్ గురించి శివానీ ఇలా ముచ్చటించింది.
‘‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ తర్వాత సుహాస్‌తో నాకిది రెండో సినిమా. ఆ చిత్రానికి పూర్తి భిన్నంగా ఇందులో సరదాగా, ఎంటర్‌టైనింగ్‌గా ఉండే పాత్ర పోషించా. అమాయకత్వంతో పాటు కామెడీ పండించే ఛాన్స్ దక్కింది. నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్‌ల కామెడీ ట్రాక్ హిలేరియస్‌గా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులకు పెద్ద సర్‌ప్రైజ్. కేవలం నవ్వించడమే కాకుండా, చివర్లో వచ్చే తండ్రీ-కొడుకుల సెంటిమెంట్ అందరినీ మెప్పిస్తుందని నమ్ముతున్నా.
ఇక కొత్త సినిమాల ఎంపిక విషయంలో కథతో పాటు నా క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఇస్తూ సెలెక్టివ్‌గా ముందుకెళ్తున్నా. వంద సినిమాలు చేయాలని నాకు లేదు, చేసినవి ఐదు సినిమాలైనా అవి మంచి కథలు కావాలని కోరుకుంటున్నా. స్టార్ హీరోల సినిమాలైనా సరే, నా పాత్రకు స్కోప్ ఉంటేనే అంగీకరిస్తాను.
ఈ అమ్మాయి ఎప్పుడూ మంచి సినిమాలే చేస్తుంది అనే నమ్మకాన్ని ఆడియెన్స్ లో కలిగించాలన్నదే నా లక్ష్యం. వ్యక్తిగతంగా నాకు రొమాంటిక్ కామెడీ సినిమాలంటే చాలా ఇష్టం. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి”.
