న్యూఢిల్లీ: వయోజనులైన స్త్రీ, పురుషుడు ‘లివ్ఇన్ రిలేషన్‌షిప్’లో ఉండటం నేరం కాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వివాహితుడైన పురుషుడు మరో వయోజన మహిళతో కలిసి ఉన్నా అది చట్టపరంగా నేరం కిందకు రాదని వెల్లడించింది. సామాజిక నైతికత కంటే చట్టానికే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేస్తూ.. ఓ జంట దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాకు చెందిన అనామిక(18), నేత్రపాల్ అనే ఇద్దరు కొద్దికాలంగా కలిసి జీవిస్తున్నారు.
అయితే నేత్రపాల్కు అప్పటికే వివాహం అయిందని, తన కుమార్తెను మభ్యపెట్టి తీసుకెళ్లాడని అనామిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెక్షన్ 87 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆ జంట హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును కొట్టివేయాలని, తమకు ప్రాణరక్షణ కల్పించాలని కోరింది. జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనాతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కేసును విచారిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. సామాజిక అభిప్రాయాలు లేదా నైతికత ఆధారంగా కోర్టులు నిర్ణయాలు తీసుకోలేవని, పౌరుల హక్కులను కాపాడటమే తమ బాధ్యత అని పేర్కొంది.
నేత్రపాల్ వివాహితుడు అయినప్పటికీ, మేజర్ అయిన యువతి పరస్పర అంగీకారంతో కలిసి ఉండటం చట్టరీత్యా నేరం కాదని వెల్లడించింది. తాను మేజర్ అని, తన ఇష్టపూర్వకంగానే నేత్రపాల్‌తో ఉంటున్నానని అనామిక పోలీసులకు స్పష్టం చేసిన విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ఆ జంట భద్రత బాధ్యత ఎస్పీదే..
కుటుంబసభ్యుల నుంచి ‘పరువు హత్య’ ముప్పు ఉందని బాధితులు ఆందోళన వ్యక్తం చేయడంపై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఆ జంటను అనామిక కుటుంబసభ్యులు నేరుగా గానీ, ఫోన్ల ద్వారా గానీ సంప్రదించకూడదని, వారి ఇంటికి వెళ్లకూడదని ఆంక్షలు విధించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ‘శక్తి వాహిని’ తీర్పును ఉటంకిస్తూ.. ఆ జంట భద్రతకు స్థానిక ఎస్పీ బాధ్యత వహించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్8కి వాయిదా వేసింది.
