బ్రిటన్ ప్రధానమంత్రి రేసు మరో మలుపు తిరిగింది. ఈ పోటీలో ఉన్న భారత సంతతి వ్యక్తి రిషీ సునాక్ కంటే మరో అభ్యర్థి లిజ్ ట్రస్ కు మద్దతు భారీగా పెరిగిందని పరిశీలకులు అంటున్నారు. ‘‘తాజా అంచనాల ప్రకారం లిజ్ ట్రస్‌కు 90శాతం విజయావకాశాలు ఉండగా.. సునాక్ గెలుపు అవకాశాలు 10శాతమే’’ అని స్మార్కెట్స్ పొలిటికల్ మార్కెట్స్ హెడ్ మాథ్యూ షాడిక్ తెలిపారు. ‘‘పోటీ మొదలైనప్పటి నుంచి రిషి సునాక్ గెలుస్తారని చాలా మంది అంచనా వేశారు. అయితే డిబేట్లలో ట్రస్ ప్రసంగాలు ఈ అంచనాలను మార్చేశాయి’’ అని ఆయన విశ్లేషించారు.
మరోవైపు రిషీ సునాక్, లిజ్ ట్రస్‌ల మధ్య పోరు దాదాపు తుది దశకు చేరుకుంది. వచ్చేవారం నుంచి కన్జర్వేటివ్ పార్టీ (టోరీ) సభ్యులకు బ్యాలెట్ పత్రాలు పంపిణీ కానున్నాయి. సెప్టెంబరు 2న సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేసిన బ్యాలెట్లను పార్టీ సభ్యులు సమర్పిస్తారు. సెప్టెంబర్ 5న ఫలితాలు వెలువడుతాయి. ప్రస్తుతం అర్హులైన కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల సంఖ్య దాదాపు 1,75,000గా ఉంది. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల మద్దతు సునాక్‌కు ఉన్నప్పటికీ.. పార్టీ సభ్యుల్లో ఎక్కువ మంది లిజ్ ట్రస్ వైపే మొగ్గుచూపుతున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. టోరీ సభ్యుల మద్దతు కూడగట్టేందుకు వీరిద్దరు ఆరువారాల దేశ పర్యటన ప్రారంభించారు. ఇప్పటికే బ్రిటన్ లోని పలు నగరాల్లో సునాక్, ట్రస్‌లు టోరీ ఓటర్లతో ముఖాముఖి చర్చల్లో పాల్గొన్నారు.
