ఎల్​కే అద్వానీకి భారతరత్న.. ప్రధాని మోదీ వెల్లడి

ఎల్​కే అద్వానీకి భారతరత్న..  ప్రధాని మోదీ వెల్లడి
  • ట్విట్టర్​లో ప్రధాని మోదీ వెల్లడి
  • దేశాన్ని ఐక్యం చేసిన నాయకుడు అద్వానీ 
  • దేశ అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతో కీలకం
  • ప్రజాస్వామ్య రక్షణకు అలుపెరగక పోరాడిన యోధుడని ప్రశంసలు 
  • నా ఆశయాలు, సిద్ధాంతాలకు దక్కిన గౌరవమిది: అద్వానీ
  • అద్వానీకి కేంద్ర మంత్రులు, నేతలు, ప్రముఖుల అభినందనలు  


బీజేపీ కురువృద్ధుడు, అయోధ్య రామమందిర ఉద్యమ రథ సారథి లాల్ కృష్ణ అద్వానీ(96)ని దేశ అత్యున్నత పౌర పురస్కారం వరించింది. ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డును ప్రకటించింది. దేశంలో హిందూత్వ ఎజెండాను తలకెత్తుకుని బీజేపీని అతిపెద్ద పార్టీగా నిలపడంలో అద్వానీ ఎనలేని కృషి చేశారు. అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం కోసం ఆయన 1990లో చేపట్టిన రథ యాత్ర దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కూడా అద్వానీ చేపట్టిన యాత్రల ఫలితంగానే.. లోక్ సభలో కేవలం 2 సీట్లకే పరిమితమై ఉన్న బీజేపీ ఆరేండ్లలోనే 161 సీట్లతో దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించి ఢిల్లీ పీఠంపై కమలం జెండా ఎగరేసింది. బీజేపీ ఆవిర్భావం నుంచి కేంద్రంలో అధికారంలోకి వచ్చే వరకూ అడుగడుగునా పార్టీ ఎదుగుదలకు  మూల స్తంభంలా నిలిచిన అద్వానీకి ప్రధాన మంత్రి పదవి మాత్రం తీరని కలగానే మిగిలిపోయింది.  2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్ నుంచి పూర్తిగా తప్పుకున్నారు.

న్యూఢిల్లీ:  బీజేపీ కురువృద్ధుడు, అయోధ్య రామమందిర ఉద్యమ రథ సారథి లాల్ కృష్ణ అద్వానీ(96)ని దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న వరించింది. ఎల్ కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డును అందజేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం ఎక్స్(ట్విట్టర్)లో ప్రకటించారు. ఇది తనకు ఉద్వేగభరితమైన క్షణమని ఆయన అన్నారు. ‘‘నేటి కాలపు అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో అద్వానీ ఒకరు. దేశ అభివృద్ధికి ఆయన అందించిన తోడ్పాటు గణనీయం” అని ప్రధాని కొనియాడారు. తాను అద్వానీతో మాట్లాడానని, అవార్డు ప్రకటించిన విషయాన్ని తెలియజేశానని వెల్లడించారు. ‘‘అట్టడుగు స్థాయి నుంచి దేశ ఉప ప్రధానిగా ఎదిగిన నేత అద్వానీ. మన హోం మంత్రిగా, సమాచార శాఖ మంత్రిగా విశేష సేవలు అందించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఆయన ప్రసంగాలు, వ్యవహార శైలి ఎల్లప్పుడూ ఆదర్శనీయం. రాజకీయ నైతిక విలువల పాటింపులో ఆయన ఒక ఉదాహరణగా నిలిచారు” అని మోదీ ప్రశంసించారు. ‘‘దశాబ్దాల పాటు ఆయన రాజకీయ జీవితం ఎల్లప్పుడూ పారదర్శకంగా, అంకితభావంతో సాగింది. దేశ ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం ఆయన ఎనలేని కృషి చేశారు” అని ప్రధాని కొనియాడారు. భారత ప్రజాస్వామ్యాన్ని జాతీయవాద సిద్ధాంతాలతో అనుసంధానం చేశారని కొనియాడారు. అద్వానీతో ఎన్నోసార్లు ఇంటరాక్ట్ అయ్యే అవకాశం తనకు దక్కిందని, ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. ప్రధాని మోదీ ప్రకటన తర్వాత రాష్ట్రపతి భవన్ నుంచి కూడా అద్వానీకి భారత రత్న అవార్డుపై అధికారికంగా ప్రకటన వెలువడింది. అద్వానీకి భారత రత్నను ప్రకటించడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతోషం వ్యక్తంచేశారని ప్రకటనలో పేర్కొన్నారు.

కుటుంబ రాజకీయాలను సవాల్ చేశారు

దేశంలో కుటుంబ రాజకీయాలను అద్వానీ సవాల్ చేశారని, అంటరాని పార్టీగా చూసిన బీజేపీ గుర్తింపును మార్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించేలా చేశారని మోదీ అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయితో కలిసి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు, జాతీయవాద సిద్ధాంతాల కోసం కృషి చేశారని కొనియాడారు. శనివారం ఒడిశాలోని సంబల్పూర్ లో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభం తర్వాత జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. అద్వానీకి భారత రత్న అంటే.. ‘నేషన్ ఫస్ట్’ అనే సిద్ధాంతానికి గౌరవం ఇచ్చుకున్నట్లేనని, దేశవ్యాప్తంగా కోట్లాది మంది బీజేపీ కార్యకర్తలకు నేతలకు గుర్తింపు దక్కినట్లేనని చెప్పారు. ‘‘ఇది పార్టీ సిద్ధాంతాలకు, కోట్లాది మంది పార్టీ కార్యకర్తల పోరాటానికి దక్కిన గుర్తింపు. రెండు ఎంపీ సీట్ల నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించేందుకు కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు లభించిన గౌరవం” అని ఆయన తెలిపారు. దేశ సేవకు జీవితాలను అంకితం చేసిన గొప్ప వ్యక్తులను జాతి ఎన్నడూ మరిచిపోదని చెప్పేందుకు ఇదే నిదర్శనమన్నారు. అద్వానీ నుంచి ప్రేమ, మార్గదర్శకత్వాన్ని పొందడం తన అదృష్టమన్నారు.

రథయాత్రలతో సంచలనం 


అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 1990లో అద్వానీ చేపట్టిన రామ రథ యాత్ర దేశమంతటా సంచలనం సృష్టించింది. హిందూత్వ ఎజెండాతో దేశంలోనే పెద్ద పార్టీగా బీజేపీ అవతరించే దిశగా ఆ యాత్రతోనే దారులు పడ్డాయి. 1991 ఎన్నికల్లో బీజేపీకి కలిసొచ్చింది. లోక్ సభలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అద్వానీ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. 1992లో బాబ్రీ విధ్వంసం తర్వాత పరిణామాలు బీజేపీని ఢిల్లీ పీఠానికి మరింత దగ్గర చేశాయి. ఆ తర్వాత జనాదేశ్, స్వర్ణ జయంతి, భరత్ ఉదయ్, భారత్ సురక్ష పేర్లతో అద్వానీ చేపట్టిన రథయాత్రలతో బీజేపీ గ్రాఫ్​ పెరిగింది. 1984 నాటికి కేవలం 2 లోక్ సభ సీట్లే గెలుచుకున్న ఆ పార్టీ..1996లో 161 సీట్లను గెలుచుకుని కేంద్రంలో తొలిసారి గద్దెనెక్కింది.  అద్వానీ 2011లోనూ యూపీఏ అవినీతిపై జనచేతన యాత్ర పేరుతో రథయాత్ర కూడా చేపట్టారు.

నా ఆశయాలు, సిద్ధాంతాలకు  దక్కిన గౌరవం: అద్వానీ 

భారత రత్న అవార్డు ఒక వ్యక్తిగా తనకు మాత్రమే కాకుండా.. జీవితంలో తాను పాటించిన ఆదర్శాలు, సిద్ధాంతాలకు కూడా దక్కిన గౌరవమని అద్వానీ అన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వం నాకు ప్రకటించిన భారత రత్నను అత్యంత వినమ్రత, కృతజ్ఞతా భావంతో అంగీకరిస్తున్నా” అని శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. పద్నాలుగేండ్ల వయసులో ఆర్ఎస్ఎస్ లో చేరిన తాను దేశం కోసం జీవితం తనకు అప్పగించిన పనిని నిస్వార్థంగా, అంకితభావంతో చేశానని పేర్కొన్నారు. ‘‘ఈ జీవితం నాది కాదు. నా జీవితమే నా దేశం” అనే నినాదమే తనకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఇదివరకే భారత రత్న పురస్కారం పొందిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్ పేయితో కలిసి తాను పని చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రజా జీవితంలో లక్షలాది మంది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో కూడా కలిసి పని చేశానన్నారు. తనకు భారత రత్న ప్రకటించడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన దివంగత భార్య కమల, ఇతర కుటుంబసభ్యులూ జీవితంలో తనకు వెన్నుదన్నుగా నిలిచారని ఆయన గుర్తు చేసుకున్నారు. మన దేశం మరింత ఉన్నత కీర్తి శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

50వ భారత ‘రత్నం’ 

భారత రత్న పురస్కారం పొందిన 50వ వ్యక్తి అద్వానీ. బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు కేంద్రం ఇటీవల భారత రత్న ప్రకటించింది. జన నాయకుడిగా పేరు పొందిన ఠాకూర్ మరణించిన 35 ఏండ్ల తర్వాత ఆయనను ఈ పురస్కారం వరించింది. అవార్డు ప్రకటన తర్వాత అద్వానీ తన నివాసం వద్ద దూరం నుంచే మీడియా ప్రతినిధులను పలకరించారు. అవార్డు రావడం పట్ల అద్వానీ చాలా సంతోషిస్తున్నారని ఆయన కుమార్తె ప్రతిభా అద్వానీ మీడియాకు తెలిపారు. బీజేపీ మాజీ ప్రెసిడెంట్ మురళీ మనోహర్ జోషి స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి ఆయనకు అభినందనలు తెలిపారు.