బీమా పాలసీలపై లోన్లు తప్పనిసరి..కంపెనీలకు ఐఆర్​డీఏ ఆదేశం

బీమా పాలసీలపై లోన్లు తప్పనిసరి..కంపెనీలకు ఐఆర్​డీఏ ఆదేశం

న్యూఢిల్లీ : అన్ని జీవిత బీమా పొదుపు ఉత్పత్తులపై ఇక నుంచి తప్పనిసరిగా పాలసీ లోన్ సదుపాయం కల్పించాలని, పాలసీదారులు లిక్విడిటీ అవసరాలను తీర్చాలని ఇన్సూరెన్స్​ రెగ్యులేటర్ ఐఆర్​డీఐ బుధవారం ఆదేశించింది.   జీవిత బీమా పాలసీలకు సంబంధించి అన్ని నిబంధనలను ఒక చోట చేర్చే మాస్టర్ సర్క్యులర్‌‌‌‌‌‌‌‌ను  ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్​డీఐ) జారీ చేసింది. పాలసీ నిబంధనలను,  షరతులను సమీక్షించడానికి సమయాన్ని అందించే ఫ్రీ లుక్ పీరియడ్​ను 15 నుంచి 30 రోజులుగా పేర్కొంది.

"పాలసీ హోల్డర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీమా నియంత్రణ సంస్థ చేపట్టిన సంస్కరణల శ్రేణిలో ఇది ఒక ముఖ్యమైన దశ. ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, కస్టమర్  సంతృప్తిని పెంపొందించడానికి అనుకూలమైన వాతావరణాన్ని మేం తీసుకొచ్చాం" అని ఐఆర్​డీఐ తెలిపింది.  మాస్టర్ సర్క్యులర్ ప్రకారం, ఉన్నత విద్య లేదా పిల్లల వివాహం వంటి ముఖ్యమైన అవసరాల కోసం పాలసీదారులకు పాక్షికంగా డబ్బు ఉపసంహరించుకోవడానికి అనుమతించాలి. నివాస గృహం/ఫ్లాట్ కొనుగోలు/నిర్మాణం, వైద్య ఖర్చులు,  తీవ్రమైన అనారోగ్యం చికిత్స కోసం లోన్​ తీసుకోవచ్చు.  

పాలసీని సరెండర్ చేసే వారికి తగినంత పరిహారం చెల్లించాలి. పాలసీదారుల ఫిర్యాదుల పరిష్కారానికి బలమైన వ్యవస్థలు ఉండాలని రెగ్యులేటరీ స్పష్టం చేసింది. ఇన్సూరెన్స్ అంబుడ్స్‌‌‌‌‌‌‌‌మన్ అవార్డుపై బీమా సంస్థ అప్పీల్ చేయకుండా పరిహారం ఇవ్వకున్నా,  30 రోజులలోపు దానిని అమలు చేయకున్నా, ఫిర్యాదుదారునికి రోజుకు రూ. 5,000 చొప్పున జరిమానా చెల్లించాలని సర్క్యులర్ పేర్కొంది.