ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే పేదలకు చేయూత.. స్వయం సహాయ సంఘాల ద్వారా లోన్లు

ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే పేదలకు చేయూత.. స్వయం సహాయ సంఘాల ద్వారా లోన్లు
  •   కామారెడ్డి జిల్లాలో 439 మందికి సాయం
  •   రూ. 5 కోట్ల 13 లక్షల లోన్​ సాంక్షన్​

కామారెడ్డి​​, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్​ అయినా డబ్బుల్లేక నిర్మాణం ప్రారంభించని పేదలకు చేయూత అందించడానికి ప్రభుత్వం పూనుకుంది. మహిళ స్వయం సహాయక సంఘాల ద్వారా అర్హులైన లబ్దిదారులకు లోన్​ ఇప్పించి సాయం అందిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగాలేక సొంతింటికి కట్టుకోలేని వారికి ఇది వరంగా మారింది. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 439 మందికి స్వయం సహాయక సంఘాల ద్వారా రూ. 5 కోట్ల 13 లక్షల లోన్​ ఇప్పించారు.

దీంతో ఇండ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. జిల్లాలో మొత్తం 12,150 ఇండ్లు నిర్మించాలని టార్గెట్ కాగా.. ఇప్పటి వరకు 11,818 ఇండ్లు శాంక్షన్​ అయ్యాయి. ఇందులో 5,770 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. 2,342 బెస్ మెంట్​ లెవల్​వరకు, 157 గోడల వరకు, 75 రూఫ్​​ లెవల్​కు వచ్చాయి. ఇండ్ల గ్రౌండింగ్​, వర్క్స్​లో కామారెడ్డి జిల్లా స్టేట్​లో టాప్​లో ఉంది. 

డబ్బుల్లేక నిర్మాణాల్లో జాప్యం

 ఒక్కో ఇందిరమ్మ ఇంటికి ప్రభుత్వం రూ. 5 లక్షలు ఇస్తోంది. నిర్మాణ దశలను బట్టి వాయిదాల్లో ఈ అమౌంట్​ను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. హౌజింగ్ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు పనులను పరిశీలించి బిల్స్​ అన్​లైన్​లో అప్​లోడ్​ చేసిన తర్వాత డబ్బులు లబ్ధిదారుల అకౌంట్​లో పడతాయి. బేస్​ మెంట్​ దశ పూర్తయిన తర్వాత ప్రభుత్వం మొదటివిడత కింద రూ. లక్ష విడుదల చేస్తుంది. దీంతో లబ్దిదారులు మొదట సొంతడబ్బులతో పనులు మొదలుపెట్టుకోవాల్సిఉంటుంది.

లబ్దిదారుల్లో చాలామంది నిరుపేదలే కావడంవల్ల దాదాపు లక్ష వరకు పెట్టుబడి పెట్టడం సాధ్యం కాక తొలివిడత మంజూరైన ఇండ్ల నిర్మాణాల్లో జాప్యం జరిగింది. ఈ విషయం సీరియస్​గా తీసుకున్న ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల ద్వారా లోన్లు ఇప్పించాలని నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన వారికి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్​ అయితే రూ. 50వేల నుంచి రూ. 2 లక్షల వరకు లోన్​ ఇస్తారు. వారు గతంలో లోన్​ తీసుకునిఉన్నా ఇంటి నిర్మాణానికి బ్యాంక్ లింకేజీ, స్ర్తీనిధి, గ్రామ సమాఖ్య ద్వారా 
లోన్​ ఇస్తారు. 

లోన్​ కోసం 970 అప్లికేషన్లు 

 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్​ అయిన వారిలో ఇప్పటి వరకు 970 మంది లోన్​ కోసం స్వయం సహాయక సంఘాలకు అప్లయ్​ చేసుకున్నారు. 501 అప్లికేషన్లు బ్యాంక్​లకు పంపారు. ఇందులో ఇప్పటి వరకు 439 మంది లబ్ధిదారులకు రూ. 5 కోట్ల 13 లక్షల లోన్​మంజూరయ్యింది. 61 అప్లికేషన్లు బ్యాంక్​ల్లో పెండింగ్​లో ఉన్నాయి. అప్లయ్​ చేసుకున్న లబ్ధిదారులకు లోన్​ ఇప్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇండ్ల నిర్మాణం వేగంగా జరిగేలా కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. మండలాలవారీగా జిల్లా అధికారులను ఇన్​చార్జిలుగా నియమించారు. ఇసుక, మొరం సమస్య రాకుండా చూస్తున్నారు. రెగ్యులర్​గా రివ్యూ చేస్తూ క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలిస్తున్నారు. 

నియోజక వర్గాల వారీగా లోన్ల వివరాలు

నియోజక వర్గం      లబ్ధిదారులు 

కామారెడ్డి                       176
ఎల్లారెడ్డి                         130
జుక్కల్                           101
బాన్సువాడ                      32