అక్కడ స్థానిక ఎన్నికల్లేవ్.. 14 ఎంపీటీసీ, 27 సర్పంచ్, 256 వార్డులకు నో ఎలక్షన్

అక్కడ స్థానిక ఎన్నికల్లేవ్.. 14 ఎంపీటీసీ, 27 సర్పంచ్, 256 వార్డులకు నో ఎలక్షన్
  •     సుప్రీంకోర్టు కేసు కారణంగా నిలిచిన ప్రక్రియ 
  •     ఎన్నికలు నిర్వహించాలని ఆయా గ్రామాల ప్రజల విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో 14 ఎంపీటీసీ స్థానాలు, 27 సర్పంచ్, 256 వార్డుల ఎన్నికకు బ్రేక్‌‌‌‌ పడింది. సుప్రీంకోర్టులో కేసు కారణంగా ఇక్కడ ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ములుగు జిల్లా మంగపేట మండలంలో 14 ఎంపీటీసీలు, 25 గ్రామ పంచాయతీల సర్పంచ్‌‌‌‌లు, 230 వార్డుసభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. 

ఈ మండలంలో జడ్పీటీసీ ఎన్నికలు మాత్రం నిర్వహించనున్నట్టు తెలిపింది. మరోవైపు కరీంనగర్ జిల్లాలోనూ రెండు గ్రామాల్లో ఎన్నికలు జరగడం లేదు. ఇక మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడేం గ్రామం ఈసారి కూడా ఎన్నికలకు దూరంగా ఉండనున్నది. దీంతో తమ గ్రామాలకు ఎన్నికలు జరిపించాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుండడంతో అభివృద్ధి కుంటుపడుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 మంగపేటలో ఇదీ పరిస్థితి..  

రాష్ట్రంలో మొత్తం 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ, 12,733 గ్రామ పంచాయతీ, 1,12,288 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ములుగు జిల్లాలోని మంగపేట మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు, 25 గ్రామ పంచాయతీలు, 230 వార్డులు, కరీంనగర్ జిల్లాలోని రెండు గ్రామ పంచాయతీలు, 16 వార్డులకు ఎన్నికలు జరగడం లేదు. 

మంగపేట మండలంలో కమలాపురం-1, కమలాపురం-2, కమలాపురం-3, మంగపేట, నర్సాపూర్, కోమటిపల్లి, చెరుపల్లి, తిమ్మంపేట, మల్లూరు, నర్సింహాసాగర్, రామనక్కపేట్, రాజుపేట్, కత్తిగూడెం, దొమ్మెడ ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగట్లేదు. అలాగే కమలాపూరం, మంగపేట్, నర్సాపూర్ బూరె, కోమటిపల్లి, కొత్తూరు మోట్లగూడెం, చెరుపల్లి, బాలన్నగూడెం, నర్సాయిగూడెం, బుచ్చంపేట, తిమ్మంపేట, మల్లూరు, నర్సింహాసాగర్, పూరెద్దుపల్లి, రమనక్కపేట్, చుంచుపల్లి, వేదగూడెం, రాజుపేట్, రామచంద్రునిపేట్, వాగొడ్డుగూడెం, కత్తిగూడెం, బ్రాహ్మణపల్లె, అక్కెనెపల్లి మల్లారం, దొమ్మెడ, నిమ్మగూడెం గ్రామాలకు సర్పంచ్​ఎన్నికలు నిర్వహించడం లేదు. మరోవైపు కోర్టు స్టే కారణంగా కరీంనగర్ జిల్లా వి.సైదాపూర్ మండలంలోని కుర్మపల్లి, రామచంద్రపూర్ గ్రామాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని అధికారులు తెలిపారు. కోర్టు నుంచి గ్రీన్​ సిగ్నల్​వస్తే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 

15 ఏండ్లుగా ఎన్నికల్లేవ్​.. 

ములుగు జిల్లా మంగపేట మండలంలోని 25 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ పల్లెలను గిరిజన గ్రామాలుగా పేర్కొంటూ గతంలో హైకోర్టు ప్రకటించింది. దీంతో ఆ గ్రామాల్లోని గిరిజనేతరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంగపేట మండలంలోని 25 గ్రామాలు గిరిజన ఏరియా పరిధిలో లేవంటూ 1950లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

ఈ అంశంపై 2013లో గిరిజన సంఘాలు హైకోర్టులో పిటిషన్ వేశాయి. నిజాం ఆర్డర్ ఆధారంగానే వాటిని గిరిజన గ్రామాలుగా పరిగణించాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో గిరిజనేతరులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తమ గ్రామాలను గిరిజన గ్రామాలుగా పరిగణించవద్దని పిటిషన్‌‌‌‌లో కోరారు.

 1950లో రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. మంగపేట మండలంలో 25 గ్రామాలు గిరిజన ఏరియా పరిధిలో లేవని.. గిరిజనేతరుల తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఈ క్రమంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ 25 గ్రామాల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ 2026 ఫిబ్రవరి 16న జరగనున్నది. కాగా, ఇక్కడ 15 ఏండ్లుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం లేదు. ఈసారి ఎంపీటీసీ, సర్పంచ్,​ వార్డు సభ్యుల ఎన్నికలు నిలిచిపోగా.. జడ్పీటీసీ ఎన్నికలు మాత్రం జరగనున్నాయి.