
- నేడు ఏజీతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం
- మరోవైపు ఎన్నికల నిర్వహణ కోసం ఎస్ఈసీకి సంసిద్ధత తెలిపిన ప్రభుత్వం
- రిజర్వేషన్లు ఇస్తే షెడ్యూల్ ప్రకటిస్తామన్న ఎస్ఈసీ
హైదరాబాద్, వెలుగు: స్థానిక ఎన్నికల నిర్వహణపై ముందుకే వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. దీనిపై అడ్వకేట్ జనరల్ (ఏజీ)తో ఆదివారం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ జీవో ఇవ్వడం.. మొత్తం రిజర్వేషన్లు 50% దాటడంపై విచారణ కొనసాగుతుందని హైకోర్టు చెప్పడంతో ఏం చేయాలనే దానిపై శనివారం రాత్రి ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ చర్చించినట్లు తెలిసింది. విచారణను హైకోర్టు వచ్చే నెల 8కి వాయిదా వేసినప్పటికీ.. ఈలోపు ఎన్నికల నోటిఫికేషన్ఇచ్చినా పిటిషన్లను విచారిస్తామని తెలిపింది. వీటిపై అధికారులతో సీఎం డిస్కస్ చేసినట్లు సమాచారం.
ఆదివారం ఏజీతో సమావేశమై.. న్యాయ నిపుణుల సూచనలకు తగ్గట్టు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. అయితే.. ఎన్నికలపై ముందుకెళ్లేలా జిల్లాల్లో రిజర్వేషన్లు ఖరారు చేసి పంపాలని అధికారులకు సర్కార్ స్పష్టం చేసింది. ఇప్పటికే జడ్పీ చైర్ పర్సన్లకు సంబంధించిన రిజర్వేషన్ల గెజిట్ఇచ్చింది. జిల్లాల్లో వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ, ఎంపీపీ అధ్యక్షులు, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్ల ప్రక్రియ శనివారం దాకా కొనసాగింది. తర్వాత రిజర్వేషన్ల జాబితాను ఆదివారం కలెక్టర్లు ప్రభుత్వానికి పంపనున్నారు. తర్వాత సీఎం గెజిట్ పబ్లిష్ చేయనున్నారు. ఈ గెజిట్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందించాక షెడ్యూల్ ప్రకటించేందుకు ఎస్ఈసీ సిద్ధంగా ఉన్నది.
ఎన్నికలు పెట్టండి.. రిజర్వేషన్లు ఇవ్వండి
హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ల దాఖలు కంటే ముందే.. అనుకున్న షెడ్యూల్ ప్రోగ్రామ్ ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదినితో సీఎస్ రామకృష్ణారావు, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, పంచాయతీరాజ్, ఆర్థిక శాఖల ముఖ్యకార్యదర్శులు, ఎక్సైజ్ కమిషనర్ తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికలు నిర్వహించాలని, అందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తరఫున సీఎస్ కంకారెన్స్ లెటర్ అందించారు. దీనికి స్పందించిన ఎస్ఈసీ.. రిజర్వేషన్ల గెజిట్ అందిస్తే వెంటనే షెడ్యూల్ ప్రకటిస్తామని, తాము అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.