బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే.. స్థానిక ఎన్నికలు నిర్వహించాలి: ఎమ్మెల్యే గంగుల కమలాకర్

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే.. స్థానిక ఎన్నికలు నిర్వహించాలి: ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కరీంనగర్‌‌ టౌన్‌‌, వెలుగు: కరీంనగర్‌‌లోని జ్యోతిబాపూలే గ్రౌండ్‌‌లో ఈ నెల 14న నిర్వహించనున్న బీసీ కదనభేరి సభకు మేధావులు, బీసీలు భారీ సంఖ్యలో హాజరుకావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌‌ పిలుపునిచ్చారు. మాజీమంత్రి శ్రీనివాస్‌‌ యాదవ్‌‌, మాజీ స్పీకర్‌‌ మధుసూదనాచారితో కలిసి కదనభేరి నిర్వహించనున్న వేదికను సోమవారం పరిశీలించారు. అనంతరం చింతకుంటలోని బీఆర్‌‌ఎస్‌‌ పార్టీ ఆఫీస్‌‌లో మీడియాతో మాట్లాడారు.

ఢిల్లీలోని జంతర్‌‌ మంతర్‌‌ వద్ద చేపట్టిన ధర్నా పెద్ద మోసమని విమర్శించారు. సీఎం,100 మంది ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి రాష్ట్రపతి, ప్రధాని అపాయింట్‌‌మెంట్‌‌ అడిగితే ఇవ్వారా అని ప్రశ్నించారు. బీసీల 42 శాతం రిజర్వేషన్‌‌ కల్పించకుండా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌ మాట్లాడుతూ మహిళలకు  రూ.2,500, కల్యాణలక్ష్మి వంటి మోసపూరిత హామీ ఇచ్చి కాంగ్రెస్‌‌ అధికారంలోకి వచ్చిందన్నారు. బీసీ ఓవర్సీస్‌‌ లోన్ల కోసం రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. సమావేశంలో బీఆర్‌‌ఎస్‌‌ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, పట్టణ ప్రెసిడెంట్‌‌ చల్ల హరిశంకర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌‌గౌడ్‌‌, బండ ప్రకాశ్‌‌, స్వామిగౌడ్, దాస్యం వినయ్‌‌భాస్కర్, నారదాసు లక్ష్మణ్‌‌రావు, తుల ఉమ, కనుమల్ల విజయ పాల్గొన్నారు.