లోకల్’షిఫ్ట్..కాంగ్రెస్ వైపు స్థానిక ప్రజాప్రతినిధుల అడుగులు

లోకల్’షిఫ్ట్..కాంగ్రెస్ వైపు స్థానిక ప్రజాప్రతినిధుల అడుగులు
  • పలు బల్దియాల్లో అవిశ్వాసాల కోసం పరుగులు
  • గ్రేటర్ వరంగల్ లో మేయర్ పై నో కాన్ఫిడెన్స్?
  • నర్సంపేట బల్దియాలో నోటీసు ఇచ్చిన 17 మంది
  • భూపాలపల్లి, వర్ధన్నపేటలోనూ సేమ్ సీన్
  • కాంగ్రెస్ లో చేరిన ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి 

హైదరాబాద్: ఎన్నికల ఫలితాలు వెలువడి ఇవాళ్టికి సరిగ్గా నెల రోజులు.. అంతలోనే రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. మొన్నటి వరకు గులాబీ జెండా పట్టుకొని తిరిగిన నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. గతంలో చాలా చోట్ల కాంగ్రెస్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లను బీఆర్ఎస్ లాక్కొని బల్దియా పీఠాలు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గ్రేటర్ శివారు బల్దియాలు, నిజామాబాద్ కార్పొరేషన్ లో బీజేపీ కార్పొరేటర్లను కూడా బీఆర్ఎస్ లాక్కుంది.  ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.  

బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడే అవిశ్వాసాలు ఉన్నా,తొక్కిపట్టారు. తీర్మానాలు పెట్టనివ్వకుండా మూడేళ్ల లిమిట్ పెట్టి అణిచేశారు. అది పూర్తయ్యాక ఈ ఏడాది మొదటి నుంచే భారీగా అవిశ్వాసాలు వచ్చినా, అధికారుల సాయంతో, వ్యక్తిగతంగా కోర్టు స్టేలతో ఆపేయించారు. మెజారిటీ సభ్యులు వద్దంటున్నా అదే పాలక మండళ్లను కొనసాగించడానికే గత ప్రభుత్వం ప్రయత్నించింది. అసెంబ్లీ రిజల్ట్ ఎఫెక్ట్ తో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అధికార పార్టీ బాటపట్టారు. అవిశ్వాసాలకు తెరలేపారు.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ గుండు సుధారాణిపై అవిశ్వాసానికి సిద్ధమవుతుండటం సంచలనంగా మారింది. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద సిటీగా పేరున్న వరంగల్ లో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లోనూ రోజురోజుకూ పరిస్థితులు మారుతున్నాయి. గుండు సుధారాణికి వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టేందుకు కార్పొరేటర్లు సిద్ధమవుతున్నారు. ఇక్కడ మొత్తం 66 డివిజన్లకు గాను కాంగ్రెస్ కేవలం నాలుగు కార్పొరేటర్లను కలిగి ఉంది. అయితే తమ వెంట 12 మంది ఉన్నారని మేయర్ వ్యతిరేక వర్గం చెబుతోంది. చాలా మంది టచ్ లోకి వచ్చారని త్వరలోనే నోటీసు అందజేస్తామని వారు అంటున్నారు.

అదే జిల్లా పరిధిలోని నర్సంపేట మున్సిపాలిటీలోనూ కౌన్సిలర్లు చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఇక్కడ మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా 18 మంది చైర్మన్ పై అవిశ్వాసం ప్రకటిస్తూ సంతకాలు చేసి డీఆర్వోకు నోటీసు అందించారు.  నర్సంపేటలో 18 మంది బీఆర్ఎస్, ఆరుగురు బీఆర్ఎస్  కౌన్సిలర్లున్నారు. నోటీసుపై 17 మంది సంతకాలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని వర్ధన్నపేట, భూపల్లి పల్లి బల్దియాలు సైతం అవిశ్వాసాల బాట పట్టాయి. పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు.  

మిగతా జిల్లాల్లోని స్థానిక సంస్థల్లోనూ అవిశ్వాసాలకు లీడర్లు రెడీ అవుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 128 పురపాలక  సంఘాలు, 11 నగరపాలక సంస్థలు, రెండు మహానగరపాలక సంస్థలున్నాయి. వీటిలో చాలా మున్సిపాలిటీలు అవిశ్వాసం బాట పట్టాయి. కొన్ని చోట్ల ఇప్పటికే అధికారులకు నోటీసులు ఇవ్వగా.. మరికొన్ని చోట్ల నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతుండటం విశేషం.

 
చేరికల జోరు ఓ వైపు అవిశ్వాసాల సీజన్ నడుస్తుండగా.. మరో వైపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హస్తం వైపు అడుగులు వేస్తుండటం గమనార్హం. ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్  పార్టీలో జాయిన్ అయ్యారు. అదే  జిల్లా డీసీసీబీ  చైర్మన్ భోజారెడ్డి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం. పార్లమెంటు ఎన్నికల నాటికి ఈ చేరికల జోరు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.