పీసీబీ ఆదేశాలను వ్యతిరేకిస్తున్న స్థానికులు, ఎన్జీఓలు

పీసీబీ ఆదేశాలను వ్యతిరేకిస్తున్న స్థానికులు, ఎన్జీఓలు
  • ఎస్​టీపీలో కెమికల్​ నీటిని ప్రాసెస్​ చేస్తారా అని ప్రశ్నలు
  • సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని డిమాండ్

ఎల్ బీనగర్, వెలుగు: ఎల్​బీనగర్​ నియోజకవర్గంలోని ‘మహావీర్ హరిణ వనస్థలి నేషనల్​ పార్క్’ సమీపంలో ఎస్​టీపీ(సీవేజ్ ట్రీట్​మెంట్ ​ప్లాంట్) నిర్మించాలని పొల్యూషన్​కంట్రోల్​బోర్డు ఇచ్చిన ఆదేశాలను ఎన్​జీఓలు, స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆటోనగర్​లోని ఇండస్ట్రీల నుంచి వస్తున్న రసాయన వ్యర్థాలు, మురుగును శుద్ధి చేయాలంటే ఎస్టీపీతో కాదని, ఈటీపీ(ఇఫ్లుయెంట్​ట్రీట్​మెంట్​ప్లాంట్) ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. దాదాపు 3,800 ఎకరాల్లో విస్తరించి ఉన్న నేషనల్​పార్కులోకి రసాయనాలు చేరుతున్నాయని, పెద్ద పెద్ద చెట్లు చచ్చిపోయాయని, వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉందని స్థానికులు, ‘ధా3ఆర్’ అనే ఎన్ జీఓ సభ్యులు స్టేట్​పొల్యూషన్ కంట్రోల్​బోర్డుకు ఫిర్యాదు చేశారు. హరిణ వనస్థలి పార్క్ ఓ వైపు నుంచి హరించుకుపోతుందని ‘వెలుగు’తోపాటు ఇతర మాధ్యమాల్లో ఇప్పటికే అనేక కథనాలు వచ్చాయి. ఫారెస్ట్​ఆఫీసర్లు తమకేం పట్టదన్నట్లు వ్యవహరించగా, పొల్యూషన్ కంట్రోల్​బోర్డు స్పందించింది. ఆటోనగర్ కు హరిణ వనస్థలి పార్కుకు మధ్యలో ఉన్న టీఎస్ఐఐసీ(తెలంగాణ స్టేట్​ఇండస్ట్రియల్​ఇన్​ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) స్థలంలో ఎస్​టీపీ నిర్మించాలని ఆదేశించింది. అక్కడ మురుగు నీటిని ప్రాసెస్​చేసి ఇతర అవసరాలకు వాడాలని, అప్పటికీ నీరు బాగోలేకుంటే డ్రైనేజీ నాలాల్లోకి విడిచి పెట్టాలని చెప్పింది. ఈ మేరకు గత శనివారం ఆదేశాలు వచ్చాయి. ఈ నిర్ణయాన్ని ఎన్​జీఓలు, పార్కు చుట్టుపక్కల కాలనీవాసులు వ్యతిరేకిస్తున్నారు.

మురుగును ఆపాలని జీహెచ్ఎంసీకి ఆదేశాలు

వివిధ కాలనీల నుంచి ఆటోనగర్ వైపుగా హరిణ వనస్థలి పార్కులోకి వస్తున్న డ్రైనేజీ నీటిని ఆపాలని జీహెచ్ఎంసీ అధికారులను పీసీబీ ఆదేశించింది. స్పందించిన జోనల్​ కమిషనర్ రూ.6 కోట్ల నిధులు కేటాయించాలని ఉన్నతాధికారులకు ప్రపోజల్స్​పంపారు. త్వరలో పార్కు గోడను ఆనుకొని డ్రైన్​నిర్మిస్తామని చెప్పారు. కాగా వనస్థలిపురం మొదలుకొని ఇటు మన్సూరాబాద్, బండ్లగూడ, మరిపల్లి, అటు హయత్ నగర్ నుంచి మూసీ వరకు దాదాపు 3,800 ఎకరాల్లో నేషనల్​ పార్క్ ​విస్తరించి ఉంది. ఇందులో కృష్ణ జింకలతోపాటు దుప్పిలు, కుందేళ్లు, అడవి పందులు, ముళ్ల పందులు, నెమళ్లు, వందల రకాల పక్షులు ఉన్నాయి. ఆటోనగర్​వద్ద ఉన్న ఇండస్ట్రీలు, గోదాంల నుంచి రసాయనాలు వస్తున్నాయని తెలిసి కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. కాలనీల్లోని డ్రైనేజీకి రసాయనాలు తోడై నేరుగా పార్కులోకి చేరుతున్నాయి. ఇప్పటికే 15 నుంచి 20 ఎకరాల్లో పార్కు పూర్తిగా దెబ్బతింది. పెద్ద పెద్ద చెట్లు చచ్చిపోయాయి. మొక్కలు మొలిచే అవకాశం లేదు. 
మా పరిధి కాదంటూ..

ఓ వైపు నుంచి పార్కులోని చెట్లు చచ్చిపోతున్నా అటవీ అధికారులు స్పందించడం లేదు. పైగా జీహెచ్ఎంసీ, ఐలా నిర్లక్ష్యంతోనే ఈ సమస్య తలెత్తుతోందని చేతులు దులుపుకుంటున్నారు. సరైన డ్రైనేజీ సిస్టమ్ ​లేకనే పార్కులోకి రసాయన వ్యర్థాలు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కాలనీల్లో డ్రైనేజీ నాలాలు మంచిగానే ఉన్నాయని, ఇండస్ట్రీల వద్దనే సరిగా లేవని, అవి తమ పరిధిలోకి రావని బల్దియా అధికారులు చెబుతున్నారు. ఇదే అదునుగా రాత్రిపూట ఆటో నగర్​ఏరియాలోని ఇండస్ట్రీల నుంచి కొందరు కెమికల్​ వేస్టేజ్ తెచ్చి పార్కు సమీపంలో వదులుతున్నారు. ఫలితంగా పార్కుతోపాటు చుట్టుపక్కల భూగర్భ జలాలు దెబ్బతింటున్నాయి. ఆటో నగర్ లోని ఫెర్టిలైజర్​కంపెనీలపై ఫోకస్​పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇండస్ట్రియల్ ఏరియా వైపు నుంచి వస్తున్న వ్యర్థాల్లో రసాయనాలు ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు. టీఎస్ఐఐసీ ప్రాంతం కింది వైపునకు వస్తున్న నీటిని ల్యాబ్ లో టెస్ట్ చేయిస్తే ప్రమాదకర స్థాయిలో కెమికల్స్​ఉన్నట్లు తేలిందని అంటున్నారు. పీసీబీ మీటింగులో డంపింగ్ యార్డు నుంచి వచ్చినట్లు చూపించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించకుంటే ఎన్​జీటీ(నేషనల్ ​గ్రీన్​ ట్రిబ్యునల్)​ని ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు.

పరిష్కారం కాకపొతే ఎన్​జీటీని ఆశ్రయిస్తం

పొల్యూషన్ కంట్రోల్​ బోర్డు కానీ.. రాష్ట్ర ప్రభుత్వం కానీ హరిణ వనస్థలి పార్కును కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నా మంచిదే. సమస్యను పరిష్కరించకపోతే మాత్రం మేం ఎన్ జీటీని ఆశ్రయిస్తాం. గత సమావేశం తర్వాత పీసీబీ టీఎస్ఐఐసీకి ఇచ్చిన గైడ్​లైన్స్​సమస్యను పరిష్కరించేలా లేవు. ఇక్కడ ఏర్పాటు చేయాల్సింది ఎస్ టీపీ కాదు ఈటీపీ. ఆటోనగర్ ఇండస్ట్రీల నుంచి వస్తున్న కెమికల్​, మురుగును ఆపాలి. పార్కులోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి.

‌‌‌‌ - మనోజ్, ‘ధా3ఆర్’ సంస్థ సభ్యుడు

రూ.6 కోట్లకు ప్రపోజల్ ​పెట్టాం

వన్య ప్రాణులను కాపాడడం మా బాధ్యత. నేషనల్ పార్కులోకి మురుగు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈ సమస్యను పరిష్కరించేందుకు రూ.6 కోట్ల నిధులు కేటాయించాలని ప్రపోజల్​ పెట్టాం. త్వరలోనే డ్రెయిన్​ ​నిర్మిస్తాం. పార్కు గోడ పక్కగా మన్సూరాబాద్ మీదుగా జీఎస్ఐ వద్ద ఉన్న డ్రెయిన్​​లోకి డైవర్ట్ చేస్తాం.

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ - పంకజ, జోనల్ కమిషనర్, ఎల్​బీనగర్