‘నా మీద ఒట్టు రోడ్డేయిస్తా‘.. ఇలాంటివి చాలా చూశామన్న జనం

‘నా మీద ఒట్టు రోడ్డేయిస్తా‘.. ఇలాంటివి చాలా చూశామన్న జనం
  •     మల్కాజ్‌‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు నిరసన సెగ
  •     రోడ్లేస్తేనే ఓట్లేస్తమని యాప్రాల్‌‌లో స్థానికుల ఆందోళన 
  •     రోడ్డు వేయిస్తానంటూ ఒట్టు పెట్టుకున్న ఎమ్మెల్యే
  •     ఇట్లాంటి ఒట్లు చాలా చూశాం.. నమ్మేది లేదన్న జనం
  •     లెటర్‌‌ హెడ్‌‌పై హామీ పత్రం రాసిచ్చి వెనుదిరిగిన ఎమ్మెల్యే

సికింద్రాబాద్, వెలుగు: జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు నిరసన సెగ తగిలింది. రోడ్డు వేస్తేనే ఓటేస్తామంటూ యాప్రాల్‌‌‌‌‌‌‌‌లో స్థానిక ప్రజలు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. ‘నో రోడ్‌‌‌‌‌‌‌‌ నో ఓట్‌‌‌‌‌‌‌‌’ అని ప్లకార్డులతో రెండు కిలోమీటర్ల మేర నిలబడి నిరసన తెలిపారు. రోడ్డెప్పుడు వేస్తారో చెప్పాలని నిలదీశారు.

నో రోడ్‌‌‌‌‌‌‌‌.. నో ఓట్‌‌‌‌‌‌‌‌

మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరి నియోజకవర్గం నేరెడ్‌‌‌‌‌‌‌‌మెట్ డివిజన్ పరిధిలో యాప్రాల్ నుంచి జవహర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌కు వెళ్లే మార్గంలో జీకే ప్రైడ్, స్వర్ణాంధ్ర అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ల దగ్గర రోడ్డు చాలా రోజులుగా గుంతలు పడి ఉంది. కనీస మరమ్మతులు కూడా లేక అధ్వానంగా తయారైంది. రోడ్డుకు రిపేర్లు చేయాలని జనం కోరుతున్నా ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోలేదు. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో ఎన్నికలు రావడంతో రోడ్డు వేస్తేనే ఓట్లు వేస్తామని, లేకుంటే వేయమని కొద్దిరోజులుగా ప్రజలు నిరసన తెలుపుతున్నారు. ఆదివారం ఆ ప్రాంతానికి ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యే హనుమంతరావు రావడంతో ప్రజలు అడ్డుకున్నారు. ‘నో రోడ్‌‌‌‌‌‌‌‌.. నో ఓట్‌‌‌‌‌‌‌‌’ అంటూ పెద్ద బ్యానరుతో ఎమ్మెల్యే వెహికల్‌‌‌‌‌‌‌‌కు అడ్డుగా నిలబడి నిరసన తెలిపారు. ‘మా రోడ్లు ఎట్లున్నయో మీకు అవసరం లేదు కాని మా ఓట్లు మాత్రం కావాలా’ అంటూ నిలదీశారు. తమ రోడ్డును మరమ్మతు చేసే వరకూ ఓటేసేది లేదని తేల్చి చెప్పారు.

ప్రచారం చేయకుండా వెళ్లిపోయిన ఎమ్మెల్యే

ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అయిపోయాక రోడ్డు వేయిస్తామని, ప్రభుత్వం వేయకున్నా తన సొంత నిధులతోనైనా వేయిస్తానని ఎమ్మెల్యే తన నెత్తి మీద చేయిపెట్టి ఒట్టు పెట్టుకొని మరీ ప్రజలతో అన్నారు. ‘ఇలాంటి ఒట్లు చాలా చూశాం. నమ్మేది లేదు’ అని జనం చెప్పారు. ‘ఈ రోడ్డు జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ పరిధిలోకి రాదా? మీ సొంత డబ్బులతో మరమ్మతులు ఎందుకు చేస్తరు? సర్కారుకు మేం ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ కడుతున్నం కదా’ అని ఎమ్మెల్యేను జనం అడిగారు. ఎన్నికల ముందు ఇలాంటి మాటలు చెప్పి తర్వాత మొండి చేయి చూపారని అన్నారు. లెటర్​హెడ్​పై ఎమ్మెల్యే హామీ పత్రం రాసివ్వడంతో స్థానికులు ఆందోళన విరమించుకున్నారు. ఎమ్మెల్యే తన ప్రచారాన్ని అర్ధంతరంగా ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

గల్లీ రోడ్లను పట్టించుకునే దిక్కు లేదు

హైదరాబాద్​ మెయిన్​ రోడ్ల పరిస్థితి ఒకెత్తయితే.. గల్లీ రోడ్ల పరిస్థితి మరో ఎత్తు. గల్లీల్లో రోడ్లన్నీ మట్టికొట్టుకుపోయి, కంకర తేలి ఉన్నాయి. నెల కింద కురిసిన వర్షాల కారణంగా పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. కొన్ని ఏరియాల్లో నిత్యం రోడ్లపై డ్రైనేజీలు పొంగుతూనే ఉన్నాయి.
అడిక్​మెట్, రాంనగర్, సికింద్రాబాద్​, నేరెడ్​మెట్​, ఉప్పల్, కార్వాన్​, టోలీచౌకి, షేక్​పేట, మెహదీపట్నం వంటి ప్రాంతాల్లోని గల్లీ రోడ్లలో డ్రైనేజీ నీళ్లు పారుతున్నాయి.  పెద్ద లీడర్ల పర్యటన ఉన్నప్పుడో.. ఎలక్షన్లు వచ్చినప్పుడో ఏదో ఆదరాబాదరాగా రోడ్లు రిపేర్​ చేస్తున్నారని, అటు తర్వాత పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. వరదలు వచ్చి రోడ్లు కొట్టుకపోయి నెల అవుతున్నా ఇంతవరకు రిపేర్లు చేయడం లేదని వరద ప్రభావిత ప్రాంతాల్లోని జనం చెప్తున్నారు.