పాకిస్థాన్ ముర్దాబాద్.. భారత్ మాతా కీ జై: కుల్గాం అమరుడికి నివాళి

పాకిస్థాన్ ముర్దాబాద్.. భారత్ మాతా కీ జై: కుల్గాం అమరుడికి నివాళి

జమ్ముకశ్మీర్ లోని కుల్గాంలో ఆదివారం జరిగిన ఎన్ కౌంటర్లో అమరుడైన డీఎస్పీ అమన్ ఠాకూర్ అంత్యక్రియలు సోమవారం ముగిశాయి. ఆయన మృతదేహం ఉదయం జమ్ములోని ఇంటికి చేరింది. స్థానిక ప్రజలు అక్కడికి చేరుకుని కన్నీటి నివాళి అర్పించారు. అలాగే జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అక్కడికి వచ్చి సంతాపం తెలిపారు. అమన్ కుటుంబానికి అండగా ఉంటామని ఓదార్చారు.

అనంతరం జరిగిన అంతిమ యాత్రలో వందలాదిగా ప్రజలు కదలి వచ్చారు. అమర్ రహే అంటూ అశ్రు నయనాలతో ముందుకు సాగారు. చిన్నా పెద్దా అంతా ‘పాకిస్థాన్ ముర్దాబాద్.. భారత్ మాతా కీ జై’ అని నినాదాలు చేశారు. ప్రభుత్వం లాంఛనాలతో గన్ సెల్యూట్ తో అంత్య క్రియలు జరిగాయి.

ధైర్యశాలిని కోల్పోయాం

ఆదివారం కుల్గాం జిల్లా తిరుగామ్ లో సెక్యూరిటీ బలగాలు తనిఖీలు చేస్తుండగా టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఎదురు కాల్పుల్లో కుల్గాం డీఎస్పీ అమన్ ఠాకూర్, ఆర్మీ మేజర్, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డీఎస్పీ అమన్ ఠాకూర్, హవల్దార్ సోమ్ వీర్ చనిపోయారు. “ఇది దురదృష్టకరమైన ఘటన. ధైర్యవంతుడైన అధికారిని కోల్పోయాం” అని జమ్మూకాశ్మీర్ డీజీపీ దిల్బా గ్ సింగ్ మీడియాతో అన్నారు. జమ్మూలోని దోడా జిల్లాకు చెందిన 2011వ బ్యాచ్ జమ్మూకాశ్మీర్ పోలీసు సర్వీసు అధికారి అమన్ ఠాకూర్ రెం డేళ్ల క్రితం కుల్గాం డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. టెర్రరిస్టులకు వ్యతిరేకంగా అనేక ఆపరేషన్లలో ఆయన పాల్గొన్నారు. గత నెల డీజీపీ నుంచి మెడల్, ప్రశంసా పత్రం కూడా అందుకున్నారు.