ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు

ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు

అసోం, మేఘాలయా రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా ఇప్పటికే వేలాది మంది నిరాశ్రయులుగా మారారు. వరదల ధాటికి మూడ్రోజుల వ్యవధిలోనే అసోంలో 55 మంది చనిపోయారు. మేఘాలయాలో 18 మంది చనిపోయినట్లు తెలిపింది విపత్తు నిర్వహణ సంస్థ. ఎడతెరిపి లేని వానలతో.. చాలా ప్రాంతాలు నీటమునిగాయి. నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

వరదల కారణంగా హోజాయ్, నల్బారి, బజలి, ధుబ్రి, కమ్రూప్, కోక్రాజార్, సోనిత్ పూర్ జిల్లాల్లో ఎక్కువగా మరణాలు నమోదయ్యాయి. హోజాయ్, సోనిత్ పూర్ లో ఇద్దరు గల్లంతయ్యారు. హోజాయ్  జిల్లా ఇస్లాంపూర్ లో.. వరద బాధితులను తరలిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. 21 మందిని అధికారులు రక్షించారు. ఈ భారీ వర్షాల వల్ల రాష్ట్రంలోని 28 జిల్లాల్లో మొత్తం 18 లక్షల మంది ప్రభావితమయ్యారని తెలిపింది అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ బులెటిన్ విడుదల చేసింది.

ఈ వరదల పరిస్థితిని తెలుసుకునేందుకు కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ సీఎం హిమంత బిశ్వ శర్మకు ఫోన్ చేశారని అధికారులు తెలిపారు. కేంద్రం నుంచి అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు ప్రధాని మోడీ.

చిరపుంజి సమీపంలోని మాసిన్రాంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. మేఘాలయాలోని మాసిన్రాంలో 100.36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్ నెలలో ఇదే అత్యధికమని... ప్రకటించింది వాతావరణ శాఖ. ఇక్కడ 1940 నుంచి గత 82 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షపాతం నమోదైనట్లు తెలిపింది వాతావరణ శాఖ.

మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మేఘాలయాలో ఇప్పటివరకు 18 మంది చనిపోయినట్లు సమాచారం. ఇటు కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి.