
హైదరాబాద్- రేపటి నుండి తెలంగాణ రాష్ట్రంలో 10 రోజుల పాటు లాక్ డౌన్ అమలు కానున్న విషయం తెలిసిందే. దీంతో వైన్ షాపుల దగ్గర భారీ క్యూ కడుతున్నారు జనం. లాక్ డౌన్ అని తెలియడంతో వెంటనే దగ్గర్లోని వైన్ షాపులకు సరుకు కోసం ఎగబడుతున్నారు. 10 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని తెలియడంతో ముందుగానే బాటిల్స్ కొనుపెట్టుకుంటున్నారు. 10 రోజులకు సరిపడా మద్యం బాక్సులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో జనం ఎక్కడా కూడా సోషల్ డిస్టెన్స్ పాటించడంలేదు. కొన్ని చోట్ల మాస్కులు కూడా పెట్టుకోవడంలేదని చెబుతున్నారు వైన్స్ షాప్స్ యజమానులు. రద్దీ ఎక్కువ కావడంతో షాపులు మూసివేస్తున్నారు. భారీగా క్యూలైన్లు ఉండటంతో పలుచోట్ల ట్రాఫిక్ కూడా జామ్ అవుతోంది. సికింద్రాబాద్, సుచిత్ర, కోఠి, ఉప్పల్ వైన్ షాపుల దగ్గర భారీ క్యూ ఏర్పడింది. ఖైరతాబాద్ చింతల్ బస్తీ, సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న వైన్ షాప్ ముందు లిక్కర్ కోసం బారీగా జనం రావడంతో.. వారి వాహనాలు రోడ్డుపై పెట్టడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.సమాచారం అందుకున్న పోలీసులు వైన్స్ షాపుల దగ్గర జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ క్యూలో రావాలని సూచిస్తున్నారు.