- జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు
- ఇక కంటైన్మెంట్ జోన్లలోనే ఈ లాక్ డౌన్
లాక్ డౌన్ 4.0 ఆదివారంతో ముగుస్తోంది. దీంతో మరో నెల రోజులు లాక్ డౌన్ పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే లాక్ డౌన్ 5.0 కేవలం కంటైన్మెంట్ జోన్లలో మాత్రమే అమలవుతుందని తెలిపింది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కంటైన్మెంట్ ఏరియాల్లో జూన్ 30 వరకు కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అయితే ఇతర ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి లాక్ డౌన్ కొనసాగించొచ్చని తెలిపింది. అయితే కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని ఏరియాల్లో ఆర్థిక కార్యకలాపాలకు సడలింపు ఇచ్చింది. రాత్రి పూట కర్ఫ్యూ మాత్రం ప్రతి రోజు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేయాలని సూచించింది. అయితే గతంలో అనుమతి ఇచ్చిన మాదిరిగా పెళ్లిళ్లకు 50 మందిని, అంత్యక్రియలు వంటి వాటికి 20 మందిని అనుమతించొచ్చని కేంద్రం తెలిపింది. రాష్ట్రాల మధ్య వ్యక్తులు, గూడ్స్ రవాణాపై ఎటువంటి ఆంక్షలు లేవని, ప్రత్యేకంగా పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. రాష్ట్రాల్లో పరిస్థితిని బట్టి వ్యక్తుల రవాణాపై ఆంక్షలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను ఇచ్చింది. అయితే దశల వారీగా దేశంలో లాక్ డౌన్ ఓపెన్ చేయాలని సూచిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. మూడు దశల్లో ఈ ఆంక్షల సడలింపును చూసించింది కేంద్ర హోం శాఖ.
ఫేజ్ 1: జూన్ 8 నుంచి వీటికే అనుమతి
– ఆలయాలు, మతపరమైన ప్రార్థన స్థలాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర హాస్పిటాలిటీ సర్వీసులు,
షాపింగ్ మాల్స్ జూన్ 8 నుంచి ఓపెన్ చేయొచ్చని కేంద్రం తెలిపింది. అయితే సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం లాంటి జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఫేజ్ 2: జూలైలో…
– స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు, ట్రెయినింగ్, కోచింగ్ సంస్థల ఓపెనింగ్ పై రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా సంస్థలు, పేరెంట్స్ తో సంప్రదించాలని హోం శాఖ సూచించింది. సంబంధిత వర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చిన తర్వాత జూలైలో నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది.
ఫేజ్ 3: పరిస్థితిని బట్టి…
– అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, బార్లు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, ఆడిటోరియాలు లాంటివి ఓపెన్ చేయడంపై పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది కేంద్రం. స్పోర్ట్స్ ఈవెంట్లు, రాజకీయ, వినోద, విద్యా, సాంస్కృతిక, మతపరమైన వేడుకలు, సభలు, సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.
