హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను మే 31 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై కేబినెట్ సోమవారం సాయంత్రం భేటీ కానుంది. సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుందని సీఎంవో ప్రకటించింది. అయితే రాష్ట్రంలో జూన్ నాలుగో తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది. గోదావరి నీటి వినియోగంపై ఆదివారం మంత్రులు, అధికారులతో సీఎం సమీక్షిస్తున్న సమయంలోనే కేంద్రం తాజా మార్గదర్శకాలు విడుదలయ్యాయి. దీంతో వాటిపైనా చర్చించినట్టు సమాచారం. ఈ భేటీలో గోదావరి పరీవాహక ప్రాంతాల మంత్రులు మాత్రమే పాల్గొనడంతో.. సోమవారం కేబినెట్ భేటీ నిర్వహించి, పూర్తిస్థాయిలో చర్చిద్దామని సీఎం సూచించినట్టు సమాచారం. ఇప్పటికే ప్రకటించిన మేరకు రాష్ట్రంలో ఈ నెల 29 వరకు లాక్ డౌన్ ఉంది. అదనంగా మరో వారం పాటు పొడిగించనున్నారు.
నిరాడంబరంగా ఆవిర్భావ వేడుకలు
జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను సాదాసీదాగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది. కరోనా నేపథ్యంలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా కార్యక్రమాలు నిర్వహించాలని.. గతంలో మాదిరిగా పబ్లిక్ గార్డెన్స్, జిల్లా కేంద్రాల్లో వేడుకలు వద్దని, గవర్నమెంట్ ఆఫీసుల్లో జాతీయ జెండాలు మాత్రమే ఎగురవేయాలని సూచించినట్టు సమాచారం. ఎట్ హోం, కవి సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర ఉత్సవాలు వద్దని స్పష్టం చేసినట్టు తెలిసింది.
సెంట్రల్ గైడ్‌లైన్స్ అన్నీ అమలు!
లాక్ డౌన్ మినహాయింపులపై కేంద్రం ప్రకటించిన గైడ్‌లైన్స్‌ను రాష్ట్రంలో యథాతథంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది. ప్రజా రవాణాకు అనుమతించే విషయంలో మాత్రం విస్తృతంగా చర్చించాక నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం. కంటెయిన్మెంట్ ప్రాంతాల్లో లాక్ డౌన్ రూల్స్‌ను కఠినంగా అమలు చేయనున్నారు. రాష్ట్రంలో కంటెయిన్మెంట్ ఏరియాలన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉండటంతో.. ఆయా చోట్ల తప్ప మిగతా
ప్రాంతాల్లో మినహాయింపులు అమలు చేసే అవకాశం ఉంది.
