రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి లాక్ డౌన్

రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి లాక్ డౌన్

రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. అత్యవసర సేవలు తప్ప వేరే వేటిని అనుమతించడం లేదు అధికారులు. ఐతే పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూర్యాపేటలోని పోస్టాఫీస్ దగ్గర పింఛనుదారులు ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు. లాక్డౌన్ తో ఉదయం 6 గంటలకే పించను తీసుకోవడానికి వృద్ధులు, దివ్యాంగులు వచ్చారు. ఐతే ఆఫీస్ ఓపెన్ చేయకపోవడంతో గంటల తరబడి ఎండలోనే నిలబడ్డారు. కొంతమంది ఎండ వేడికి తట్టుకోలేక అక్కడే కూర్చున్నారు. పోస్ట్ ఆఫీస్ దగ్గర కనీసం టెంట్ కూడా వేయలేదని ఆరోపించారు. తాగడానికి నీళ్లు కూడా లేవన్నారు.  లాక్ డౌన్ రూల్స్ కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. ఇష్టం వచ్చినట్టు రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు డీజీపీ మహేందర్ రెడ్డి. అత్యవసర సేవలకు మినహా .... ఇతర విషయాలకు బయటకు రావొద్దన్నారు. 

మొదటి రోజు 6 గంటల నుంచి 10 గంటల వరకు మినహాయింపులు ఇచ్చారు. దీంతో కిరాణా షాపులు, కూరగాయల మార్కెట్లు పబ్లిక్ తో కిటకిటలాడాయి. పాలు, కూరగాయలు, పండ్ల మార్కెట్లు ఉదయం 6 గంటల నుంచే ఓపెన్ చేశారు. ఇక లాక్ డౌన్ పెట్టడంతో సిటీలోని చాలామంది పబ్లిక్... సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో మార్నింగ్ టైమ్ లో ఆర్టీసీ బస్టాండ్లు బస్సుల్లో రద్దీ కనిపించింది. ఇక హైదరాబాద్ మెట్రో రైళ్లు 9.45 కే ఆపేశారు అధికారులు. మరోవైపు వైన్ షాపులు కూడా 6 గంటల నుంచి 10 గంటల వరకు ఓపెన్ ఉన్నాయి. 

మరోవైపు లాక్ డౌన్ టైంలోనూ కొన్నింటికి మినహాయింపు ఇచ్చింది సర్కార్. అత్యవసర వైద్యం కోసం వెళ్తున్న బాధితులు, వైద్యరంగంలో పనిచేసే వారికి అనుమతి ఇచ్చింది. నిత్యావసర వస్తువుల రవాణాకు ఓకే చెప్పింది. పాలు, కూరగాయలు, ఆహార సామగ్రి, డెయిరీ ప్రొడక్ట్స్ , వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు సిబ్బందికి ప్రత్యేక పాసులు కేటాయించింది. మరోవైపు ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులకు అనుమతి ఇచ్చింది. బ్యాంకులు, ఏటీఎంలు యథావిధిగా పనిచేయనున్నాయి. ముందస్తు అనుమతులతో పెళ్లిళ్లకు 40 మందికి, అంత్యక్రియలకు గరిష్టంగా 20 మందికి అనుమతి ఇచ్చింది.