
- ముంబై లాక్డౌన్ తప్పదా?
- కార్పొరేషన్‌దే నిర్ణయమన్న సర్కారు
ముంబై: ‘ముంబైలో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. వ్యాప్తి ఎక్కువైతే నైట్ కర్ఫ్యూ లేదా పాక్షికంగా లాక్డౌన్ పెట్టే చాన్స్ ఉంది’ అని ముంబై గార్డియన్ మంత్రి అస్లామ్ షేక్ చెప్పారు. ముంబైలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకున్నా నిర్ణయాధికారం స్థానిక అధికారులదేనని తెలిపారు. లాక్డౌన్ పెట్టాలా వద్దా కూడా వాళ్లే నిర్ణయిస్తారన్నారు. మంత్రి అస్లామ్ మంగళవారం మాట్లాడుతూ.. కేసులు ఇలానే పెరుగుతూ పోతే సాయంత్రం జనాలు ఎక్కువగా గుమిగూడే బీచ్లు, గేట్ వే ఆఫ్ ఇండియాను మూసేయాల్సి వస్తుందన్నారు. మాస్కులు పెట్టుకోని వాళ్లకు పెనాల్టీ వేస్తున్నామన్నారు. మరోవైపు ముంబైలో లాక్డౌన్ పెట్టే ఉద్దేశమైతే ఇప్పటివరకు లేదని బీఎంసీ అడిషనల్ మున్సిపల్ కమిషనర్ సురేశ్ కకణి చెప్పారు. ముంబైలో కొద్ది రోజులుగా రోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వల్ల ఇప్పటివరకు అక్కడ 11,508 మంది చనిపోయారు.
రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 98 వేలు
మూడ్రోజులుగా రాష్ట్రంలో రోజూ 10 వేలకు పైగా కేసులు నమోదవగా సోమవారం 8,744 కేసులు రికార్డయ్యాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 98 వేలున్నాయి. కేసులు పెరుగుతుండటంతో కరోనా కట్టడిపై అక్కడి రాష్ట్ర సర్కారు మరో రెండు, మూడు రోజుల్లో రివ్యూ మీటింగ్ పెట్టబోతోంది.
నాసిక్‌లో వీకెండ్ లాక్డౌన్
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే ఆంక్షలు పెట్టారు. ఈ మంగళవారం నుంచి నాసిక్ జిల్లాలో వీకెండ్ లాక్డౌన్ విధించారు. మార్చి 15 నుంచి జిల్లాలో పెళ్లిళ్లకు అనుమతి లేదని అధికారులు చెప్పారు. ఇప్పటికే పర్మిషన్ తీసుకున్న వారికి మార్చి 15లోపు అవకాశం ఇచ్చారు. థానేలో 11 హాట్స్పాలలో మార్చి 13 నుంచి 31 వరకు లాక్డౌన్ పెట్టారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ పెట్టినప్పుడు ఎలాంటి రూల్స్ ఉన్నాయో అవే ఫాలో అవుతామని జిల్లా యంత్రాంగం చెప్పింది. ఔరంగాబాద్ జిల్లాలోనూ మార్చి 11 నుంచి ఏప్రిల్ 4 వరకు రాత్రి 9 నుంచి పొద్దున 6 వరకు నైట్ కర్ఫ్యూ పెట్టారు. వీకెండ్స్లో ఫుల్ లాక్డౌన్ విధించారు.