హైదరాబాద్, వెలుగు నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం నుంచే లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయడంపై పోలీసులు, అధికారులు దృష్టిపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే స్పెషల్ డ్రైవ్ లు చేపట్టి, అవసరం లేకున్నా రోడ్లపైకి వచ్చినవారి వాహనాలను సీజ్ చేశారు. సుమారు 350కి పైగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. జిల్లాల బోర్డర్స్ లో వెహికల్స్‌పై వెళ్తున్న ప్రతి ఒక్కరి ట్రావెలింగ్ వివరాలను రికార్డు చేశారు. రూల్స్‌కు విరుద్ధంగా దూర ప్రాంతాలకు ప్రయాణం చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలోనూ లాక్ డౌన్ మరింత పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు.
మూడు కిలోమీటర్లకే అనుమతి
ఇండ్ల నుంచి బయటికొచ్చిన వారిని మూడు కిలోమీటర్లలోపే అడ్డుకున్నారు. లోకల్ అడ్రస్ ప్రూఫ్ తో పాటు వెహికల్ డాక్యుమెంట్స్ ను పరిశీలించి, రోడ్లపైకి వచ్చిన కారణాలను తెలుసుకున్నారు. ఆ వివరాల ఆధారంగా వెహికల్ నంబర్, ఇతర డేటాను టీఎస్ కాప్ యాప్ లో అప్ లోడ్ చేశారు. ప్రతి చెక్ పోస్టు వద్ద ఈ డేటాను చెక్ చేసి.. రూల్స్‌ను పాటించని వారిపై కేసులు నమోదు చేశారు. బండి, ఆర్సీ బుక్, డ్రైవింగ్ లైసెన్స్ స్వాధీనం చేసుకున్నారు. లాక్ డౌన్ పూర్తయ్యాక సంబంధిత పోలీస్ స్టేషన్ కు, కోర్టుకు వెళ్లి వెహికిల్స్ రిలీజ్ చేయించుకోవాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాచకొండ, సైబరాబాద్ పరిధిలో ప్రతీ మూడు కిలోమీటర్లకు ఓ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి రోడ్లపైకి వచ్చిన అన్ని వాహనాల వివరాలు సేకరించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 150కిపైగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. జనం ఎక్కువగా బయటికి వస్తున్న సౌత్ జోన్ పరిధిలో హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ స్వయంగా పర్యటించి పరిశీలించారు. సనత్ నగర్, ఎర్రగడ్డలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ పర్యటించారు.
జిల్లాల్లో ఎక్కడికక్కడ చెకింగ్లు
జిల్లాల్లో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులు స్వయంగా రంగంలోకి దిగారు. పట్టణాల్లోని కీలక ప్రాంతాలు, రోడ్లు, కూడళ్లలో చెక్‌పోస్టులు పెట్టి తనిఖీలు చేయించారు. కూరగాయలు, కిరాణా దుకాణాలు, బ్యాంకుల వద్ద సోషల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకున్నారు. రెడ్‌జోన్లపై ప్రత్యేకంగా ఫోకస్ చేసి, ఎవరినీ బయటకు రాకుండా చూశారు. కరీంనగర్ సిటీలోని కీలకమైన ప్రాంతాల్లో పోలీస్ కమిషనర్ స్వయంగా తనిఖీలు చేపట్టి వాహనాలను సీజ్ చేశారు. కామారెడ్డిలో కలెక్టర్ శరత్, ఎస్పీ శ్వేత పర్యటించారు. ఆ జిల్లాలో ఒకేరోజు 309 వెహికిల్స్ సీజ్ చేశారు. వరంగల్ అర్బన్, రూరల్, జనగామ జిల్లాల్లో 291 వాహనాలు సీజ్ చేసి, 604 కేసులు నమోదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మధ్యాహ్నం 12 గంటలకే షాప్స్మూయించారు. సిద్దిపేటలో పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ తనిఖీల్లో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో 44 వాహనాలు సీజ్ చేసి, ఆరుగురిపై కేసు పెట్టారు. మంచిర్యాలలో మార్కెట్లు, నిత్యావసర సరకుల దుకాణాల వద్ద సోషల్ డిస్టెన్స్ తీరును పరిశీలించేందుకు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు.
