
కరోనాను కట్టడి చేసేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలు ఐక్యంగా పోరాడుతున్నాయని, రాజకీయాలకు అతీతంగా అందరూ కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. ఒక్క పశ్చిమ బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాలు, అందరూ ఐక్యంగా పోరాడుతున్నారన్నారు. ప్రధాని నరేంద్రమోడీ పిలుపు నిచ్చిన క్లాప్స్ , లైటింగ్ ల్యాంప్ కు దేశ ప్రజలంతా స్పందించారని , కరోనా పై పోరాటంలో దేశమంతా ఒక్కతాటి పై ఉందనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు.
మే 3 తరువాత లాక్ డౌన్ ఎత్తివేస్తారో లేదో ఇప్పుడే చెప్పలేమని, జూన్ వరకు కూడా దేశంలో లాక్ డౌన్ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉండొచ్చని చెప్పారు మురళీధర్ రావు. అప్పటి పరిస్థితిని బట్టి కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు. దేశంలో మరో ఏడాది వరకు పబ్లిక్ మీటింగ్ లు ఉండకపోవచ్చన్నారు.
శుక్రవారం ప్రధాని నరేంద్రమోడీ దేశంలో ఉన్న అన్ని గ్రామాల సర్పంచులతో మాట్లాడుతారని, శనివారం ఆర్థికవేత్తలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్సు లో మాట్లాడుతారని చెప్పారు. జూన్ తరువాత స్కూళ్ళు, కాలేజీలు ఎలా నడిపించాలనే అంశంపై సీరియస్ చర్చ జరుగుతుందని చెప్పారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం మేధావుల సలహాలు తీసుకుంటుందన్నారు. ఇప్పటి వరకు ఉన్న క్లాస్ రూమ్ సిస్టం భవిష్యత్తులో ఉండకపోవచ్చని, ప్రతి క్లాస్ లో విద్యార్దుల సంఖ్య తగ్గించే విధంగా ఏర్పాట్లు చేసే అవకాశముందన్నారు.