అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ తెల్లారి లాగర్ రూమ్ ధ్వంసం..

అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ తెల్లారి లాగర్ రూమ్ ధ్వంసం..

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని విషయాలు బయటకొచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు పోలీసుల విచారణలో వెల్లడించిన వివరాలు సంచలనంగా మారాయి. 1,200 మంది ఫోన్లను ట్యాప్ చేశామని ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో తెలిపారు. ఎస్‌‌‌‌ఐబీలో స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్స్‌‌‌‌(ఎస్‌‌‌‌ఓటీ) చీఫ్‌‌‌‌ గా ప్రణీత్‌‌‌‌రావు పని చేశారు. ఆయన టీమ్‌‌‌‌లో ఇద్దరు ఇన్‌‌‌‌స్పెక్టర్లు, ఇద్దరు ఎస్‌‌‌‌ఐలు సహా మొత్తం 10 మంది ఉన్నారు. ఎస్‌‌‌‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో ప్రణీత్‌‌‌‌రావుకు డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉండేవి. ఎవరెవరిని టార్గెట్ చేయాలి? అనే సమాచారం అందేది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఓడిపోవడంతో ప్రభాకర్ రావు టీమ్ అలర్ట్ అయింది. ప్రభుత్వం మారితే తమ ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ వ్యవహారం బయటపడుతందనే భయంతో ఎస్‌‌‌‌ఐబీ లాగర్ రూమ్‌‌‌‌ను ధ్వంసం చేసేందుకు కుట్ర చేసింది. నవంబర్‌‌‌‌‌‌‌‌ 30న ఎన్నికలు జరగ్గా, అదే రోజు నుంచి ఆపరేషన్స్ నిలిపివేశారు. కాంగ్రెస్సే గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడి కావడంతో లాగర్ రూమ్ ధ్వంసం చేయాలని ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావు ఆదేశాలిచ్చారు. ఆయన ఆదేశాల మేరకు ప్రణీత్‌‌‌‌రావు, భుజంగరావు, తిరుపతన్న, వేణుగోపాల్‌‌‌‌రావు పథకం రచించారు. డిసెంబర్ 3న రిజల్ట్ రావడం, కాంగ్రెస్ గెలవడంతో ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. ప్లాన్ ప్రకారం ఎస్‌‌‌‌ఐబీ లాగర్ రూమ్‌‌‌‌ను ధ్వంసం చేయాలని ప్రణీత్‌‌‌‌రావును ఆదేశించారు. దీంతో లాగర్ రూమ్‌‌‌‌లోని సీసీటీవీ కెమెరాలను స్విచ్‌‌‌‌ ఆఫ్ చేయాలని అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ఐ అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ను ప్రణీత్‌‌‌‌రావు ఆదేశించారు. అందుకు అనిల్‌‌‌‌కుమార్ నిరాకరించడంతో ప్రభాకర్ రావు ఆదేశాలు అని చెప్పారు. ఆ తర్వాత సీసీటీవీ కెమెరాలు ఆఫ్‌‌‌‌ చేశారు. డిసెంబర్ 4న రాత్రి 7:30 నుంచి 8:15 గంటల మధ్య లాగర్ రూమ్‌‌‌‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ కు చెందిన శ్రీనివాస్, అనంత్‌‌‌‌ను ఎస్ఐబీ ఆఫీస్‌‌‌‌కి పిలిపించి 50 హార్డ్ డిస్క్ లు, సర్వర్లు తొలగించారు. వాటి స్థానంలో వేరే వాటిని ఏర్పాటు చేశారు. అసలైన హార్డ్ డిస్క్ లను ముక్కలు ముక్కలు చేసి మూసీలో పడేశారు. ఇలా ఎస్‌‌‌‌ఐబీ లాగర్ రూమ్‌‌‌‌లో ఫోన్‌‌‌‌ ట్యాపింగ్ డేటాతో పాటు ఇంటెలిజెన్స్‌‌‌‌కు చెందిన కీలక సమాచారాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు.