రాష్ట్రంలో ప్రచారం పీక్స్‌‌‌‌..తెలంగాణకు క్యూ కడుతున్న జాతీయ నేతలు

రాష్ట్రంలో ప్రచారం పీక్స్‌‌‌‌..తెలంగాణకు క్యూ కడుతున్న జాతీయ నేతలు
  • తెలంగాణకు క్యూ కడుతున్న బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌ జాతీయ నేతలు
  • 5 నుంచి 10వ తేదీ దాకా వరుస టూర్లు
  • మోదీ, అమిత్‌‌‌‌ షా, నడ్డా, రాహుల్‌‌‌‌, ప్రియాంక రాక
  • సభలు, సమావేశాలు, కార్నర్‌‌‌‌‌‌‌‌ మీటింగ్స్‌‌‌‌, రోడ్‌‌‌‌ షోలతో హోరెత్తనున్న ప్రచారం
  • అగ్ర నేతల రాకతో ఆయా పార్టీల కేడర్‌‌‌‌‌‌‌‌లో ఉత్సాహం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లోక్‌‌‌‌సభ ఎన్నికల ప్రచారం పీక్స్ చేరింది. ఈ నెల 11వ తేదీతో ప్రచారం ముగియనుండటంతో జాతీయ పార్టీల అగ్రనేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్‌‌‌‌ జేపీ నడ్డాతో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారం నిర్వహించేందుకు తెలంగాణకు రానున్నారు.

ఇప్పటికే ఆయా నేతల షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రంలో డబుల్ డిజిట్ సీట్లను గెలవాలని బీజేపీ.. లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. దానికి అనుగుణంగానే ఆయా పార్టీల అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటలు చేస్తూ, క్యాడర్‌‌‌‌‌‌‌‌లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. జాతీయ నాయకుల పర్యటనల నేపథ్యంలో రాష్ట్ర నేతల మధ్య మనస్పర్థలను పక్కనబెట్టి వారి ప్రచారాన్ని విజయవంతం చేసేందుకు రెడీ అవుతున్నారు.

కాగా, ఈ నెల 5, 9 తేదీల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటించనుండగా, ఈ నెల 6, 7 తేదీల్లో ప్రియాంక గాంధీ ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 8, 10 తేదీ ల్లో ప్రధాని మోదీ, 5న అమిత్ షా, 6న జేపీ నడ్డా టూర్లు ఖరారయ్యాయి. ఈ సందర్భంగా బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్స్‌‌‌‌తో పాటు రోడ్ షోలు నిర్వహించనున్నారు. అగ్రనేతలతో పాటు పీసీసీ చీఫ్ హోదాలో సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి వారం రోజుల నుంచి రోజూ మూడు నాలుగు సభల్లో పాల్గొంటున్నారు. ఉదయం సభలు, సాయంత్రం రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ప్రచారం చివరి రోజు వరకు ఇదే విధానంలో ప్రచారం నిర్వహించనున్నట్టు నేతలు చెబుతున్నారు. 

ఈ నెల 5న రాహుల్, 6, 7 తేదీల్లో ప్రియాంక రాక

ఈ నెల 5వ తేదీన ఆదిలాబాద్ లోక్‌‌‌‌సభ పరిధిలోని నిర్మల్‌‌‌‌లో ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసిన సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు నాగర్ కర్నూల్ సెగ్మెంట్‌‌‌‌లోని గద్వాలలో జరిగే సభకు హాజరుకానున్నారు. అలాగే, ఈ నెల 9న మరోసారి రాష్ట్రానికి రాహుల్ రానున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు కరీంనగర్ సభకు, సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌‌‌‌లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ పాల్గొని ప్రసంగిస్తారు. అలాగే, ఈ నెల 6, 7 తేదీల్లో ప్రియాంక గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు.

6వ తేదీ ఉదయం 11 గంటలకు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డిలో, మధ్యాహ్నం 3 గంటలకు తాండూర్ సభలో ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు సికింద్రాబాద్ రోడ్ షోలో పాల్గొంటారు. 7వ తేదీ ఉదయం 11కు మెదక్ పార్లమెంట్ పరిధిలోని నర్సాపూర్ బహిరంగ సభలో, సాయంత్రం 7 గంటల నుంచి కూకట్ పల్లి, శేర్ లింగంపల్లి నియోజకవర్గాల్లో రోడ్ షోలలో ప్రియాంక పాల్గొననున్నారు. 

8న రాష్ట్రానికి మోదీ..

ఈ నెల 8న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని వేములవాడలో 9 గంటలకు జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఉదయం 10.30కు వరంగల్ జిల్లా మడికొండలో జరిగే సభలో ఆయన ప్రసంగిస్తారు. ఆ తర్వాత మళ్లీ ఈ నెల 10న రాష్ట్రానికి రానున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు మహబూబ్ నగర్ సెగ్మెంట్ పరిధిలోని నారాయణపేటలో ప్రచారంలో పాల్గొననుండగా, సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌‌‌‌గిరి పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలోని నాయకులు, కార్యకర్తల బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. 

5న అమిత్ షా.. 6న నడ్డా..

ఈ నెల 5న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానుండగా, అదే రోజు ఉదయం 11.30 గంటలకు ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌‌‌‌లోని సిర్పూర్ కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొ ననున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు నిజామాబాద్ పార్ల మెంట్ పరిధిలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసం గిస్తారు. సాయంత్రం 4 గంటలకు మల్కాజ్‌‌‌‌గిరి పార్లమెంట్ పరిధిలో జరిగే బహిరంగ సభలో పాల్గొని మాట్లాడనున్నారు.

అలాగే, ఈ నెల 6న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పెద్దపల్లిలో, మధ్యాహ్నం 1 గంటకు భువనగిరిలో, 3.30 గంటలకు నల్గొండలో జరిగే సభల్లో పాల్గొననున్నారు.