
- రాష్ట్రంలోని 17 సీట్లకు రేపు పోలింగ్
- సుడిగాలి పర్యటనలు చేసిన మోదీ, అమిత్ షా, రాహుల్, ప్రియాంక, రేవంత్, కేసీఆర్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. 17 ఎంపీ సీట్లకు సోమవారం పోలింగ్ జరగనుంది. గత 20 రోజులుగా రాష్ర్టంలో ఎన్నికల ప్రచారం హోరెత్తగా.. మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో శనివారం సాయంత్రం 4 గంటలకు, ఇతర జిల్లాల్లో 6గంటలకు క్యాంపెయిన్ ముగి సింది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఇతర రాష్ర్టాల నేతలు తెలంగాణ విడిచి వెళ్లారు. రిజర్వేషన్ల రద్దు, ఫోన్ ట్యాపింగ్, పదేండ్ల కేసీఆర్ పాలన, 4 నెలల కాంగ్రెస్ పాలన అంశాలపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రంలో ప్రచారం జోరుగా సాగింది.
కదిలొచ్చిన అగ్రనేతలు..
తెలంగాణలో తమ అభ్యర్థుల గెలుపు కోసం అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేశారు. వివిధ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లలో పాల్గొని ప్రచారం నిర్వహించారు.బీజేపీ నుంచి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ప్రమోద్ సావంత్, పుష్కర్ సింగ్ ధామి, భజన్ లాల్ శర్మ, పలువురు కేంద్ర మంత్రులు
ఆ పార్టీ ముఖ్య నేతలతో పాటు కొందరు సెలబ్రిటీలు ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక, సీఎం రేవంత్ ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా నియోజకవర్గాల్లో పర్యటించగా, కేటీఆర్, హరీశ్ వివిధ సెగ్మెంట్లలో ప్రచారం నిర్వహించారు.
8 సార్లు వచ్చిన మోదీ..
గత మూడు నెలల్లో మోదీ 8 సార్లు తెలంగాణకు వచ్చారు. మార్చిలో ఐదుసార్లు, ఏప్రిల్‌లో ఒకసారి, మేలో రెండు సార్లు రాష్ట్రంలో పర్యటించారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందు అదిలాబాద్‌కు వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తర్వాత సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్‌ను దర్శించుకొని సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నారు. షెడ్యూల్ వచ్చాక మల్కాజ్గిరి రోడ్ షోలో.. నాగర్ కర్నూలు, జగిత్యాల, ఆందోల్, వేముల వాడ, వరంగల్, నారాయణపేట, హైదరాబాద్ పబ్లిక్ మీటింగ్‌లలో పాల్గొని ప్రచారం నిర్వహించారు.
అమిత్ షా ఐదుసార్లు రాష్ట్రంలో పర్యటించారు. సిద్దిపేట, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, సిర్పూర్ కాగజ్ నగర్, నిజామాబాద్, భువనగిరి, వికారాబాద్ , వనపర్తి సభల్లో పాల్గొన్నారు. నడ్డా ఐదు సభలు, ఒక రోడ్ షోకు హాజరయ్యారు. కొత్తగూడెం, మహబూబాబాద్, పెద్దపల్లి, చౌటుప్పల్ పబ్లిక్ మీటింగ్స్ లో పాల్గొనగా, నిజాంపేటలో రోడ్ షో నిర్వహించారు.
ఆరు సభలకు రాహుల్..
రాష్ట్రంలో రాహుల్ గాంధీ విస్తృతంగా పర్యటించారు. తుక్కుగూడ, నిర్మల్, గద్వాల్, సరూర్ నగర్, నర్సాపూర్, ఆదిలాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ప్రియాంక గాంధీ తాండూరు, కామారెడ్డి మీటింగ్ లలో పాల్గొని ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే భువనగిరి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని నకిరేకల్ లో ప్రచారం నిర్వహించారు.
ఇక బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బస్సు యాత్ర చేశారు. 13 ఎంపీ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ఆయన సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రెండ్రోజులు ప్రచారం చేయకుండా ఈసీ నిషేధం విధించింది. కేటీఆర్, హరీశ్ రావు ఎక్కువగా కరీంనగర్, మెదక్ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు.