లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికలే టార్గెట్​

లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికలే టార్గెట్​

అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు ఇచ్చిన తెలంగాణ ఓటర్ల చేతి వేలిపై సిరా మరక పూర్తిగా చెరగకముందే రాష్ట్రంలో లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. త్వరలో జరగబోయే దేశ సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌,  బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీలకు రెఫరెండంగా మారనున్నాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం సన్నగిల్లిందా?  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌పై అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిన ప్రజాగ్రహం చల్లారిందా? కేంద్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీపై తెలంగాణ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుంది? వంటి ప్రశ్నలతో రాబోయే సార్వత్రిక ఎన్నికలే టార్గెట్​గా తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి . 2023 నవంబర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను అధ్యయనం చేస్తే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ పెద్దపల్లి,  జహీరాబాద్‌‌‌‌‌‌‌‌,  మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌,  నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌,  నల్గొండ, భువనగిరి, వరంగల్‌‌‌‌‌‌‌‌, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌, ఖమ్మం లోక్‌‌‌‌‌‌‌‌సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మంట్లలో అత్యధిక ఓట్లు సాధించింది. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌, కరీంనగర్‌‌‌‌‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌, మెదక్‌‌‌‌‌‌‌‌, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌, చేవెళ్ల లోక్‌‌‌‌‌‌‌‌సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మంట్లలో అత్యధికంగా ఓట్లు పొందింది. ఎంఐఎం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లోక్‌‌‌‌‌‌‌‌సభ నియోజకర్గం పరిధిలో తన పట్టు నిలుపుకున్నది.

తెలంగాణలో 2019 పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో 3 స్థానాలు సాధించిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 9 లోక్‌‌‌‌‌‌‌‌సభ నియోజకవర్గాల పరిధిలో ఆధిక్యత కనబర్చింది. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ 2019లో 9 స్థానాల్లో గెలవగా 2023లో 7లోక్‌‌‌‌‌‌‌‌సభ నియోజకవర్గాల పరిధిలో ఆధిక్యత సాధించింది. 2019లో 4 స్థానాల్లో గెలిచిన బీజేపీకి 2023లో ఒక్క పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గం పరిధిలో కూడా ఓట్ల పరంగా ఆధిక్యత రాలేదు. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి గెలిచిన మల్కాజిగిరి పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ 2023లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఒక్క సీటు కూడా గెలవలేదు. కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ లోక్‌‌‌‌‌‌‌‌సభ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో బీజేపీ ఓడిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ 4, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ 2, బీజేపీ 4 అసెంబ్లీ స్థానాలు, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ 4, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ 2, బీజేపీ 3 స్థానాలు, కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ 8, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ 5 స్థానాలు, మెదక్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ 3, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ 7 స్థానాలు, రంగారెడ్డిలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ 4, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ 10 స్థానాలు, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ 7, బీజేపీ 1, ఎంఐఎం 7 స్థానాలు, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ 12, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ 2 స్థానాలు, నల్గొండలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ 11, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ 1 స్థానం, వరంగల్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ 10, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ 2 స్థానాలు, ఖమ్మంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ 8, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ 1, సీపీఐ 1 స్థానం గెలిచింది.  అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు గెలిచిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ 30 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. 39 సీట్లు గెలిచిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ 70 చోట్ల రెండో స్థానంలో ఉంది. 8 సీట్లు గెలిచిన బీజేపీ 19 చోట్ల రెండో స్థానంలో ఉంది.

కాంగ్రెస్​కు అగ్నిపరీక్ష

అసెంబ్లీ ఎన్నికల ఆధారంగా లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల ఫలితాలను పూర్తిగా అంచనా వేయలేం. అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర పరిస్థితుల ఆధారంగా, లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికలు జాతీయాంశాల ఆధారంగా జరిగే అవకాశాలుంటాయి. దీనికి ఉదాహరణగా 2018లో జరిగిన మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌, రాజస్థాన్‌‌‌‌‌‌‌‌, చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ 2019లో జరిగిన లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లో ఘోర ఓటమి పాలయ్యింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలు సాధించి పగ్గాలు చేపట్టిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ 2019 లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో 9 స్థానాలు గెలిచింది. 2014లో 11 ఎంపీ సీట్లు గెలిచిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ 2019లో 2 స్థానాలు కోల్పోయింది. ఈ ఫలితాలను పరిశీలిస్తే అసెంబ్లీ ఎన్నికలకు, లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికలకు వ్యత్యాసం ఉంటుందని చెప్పవచ్చు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాలతో అందలమెక్కిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు రాబోయే పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ఎన్నికలు అగ్నిపరీక్షే. 2004, 2009లో కేంద్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని లోక్‌‌‌‌‌‌‌‌సభ ఫలితాలే ఊపిరి పోశాయి. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ హైకమాండ్‌‌‌‌‌‌‌‌ తెలుగు రాష్ట్రమైన తెలంగాణపై గంపెడాశలు పెట్టుకొని  ఇక్కడ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 
 
కేసీఆర్​ను వెంటాడుతున్న వైఫల్యాలు

ఉద్యమనేతగా అధికారం చేపట్టిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను పదేండ్ల ప్రభుత్వ వైఫల్యాలు వెంటాడుతున్నాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మళ్లీ కృష్ణా జలాల సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌ను బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఎత్తుకుంది. గతంలో వివిధ ఎన్నికల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వెంట ఏకపక్షంగా ఉన్న ముస్లిం ఓట్లు అసెంబ్లీ ఎన్నికల్లో సగం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ వైపు మళ్లాయి. పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో జాతీయ అంశాలు ప్రభావం అధికంగా ఉండే అవకాశాలు ఉండడంతో మైనార్టీలు బీజేపీకి ప్రత్యర్థిగా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కంటే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కే  మద్దతివ్వవచ్చు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కారు సర్వీసు కోసం గ్యారేజీకి వెళ్లిందని, త్వరలో తిరిగి వస్తుందని ఆ పార్టీ అధినేతలు చెబుతున్నా, కారుకు సరైన రీతిలో మరమ్మతులు చేపట్టకపోతే చివరికి షెడ్డుకే పరిమితం కావడం ఖాయం. దేశంలో మోదీ గాలి వీస్తుందని తెలంగాణలో కూడా అత్యధిక స్థానాలు సాధిస్తామనే ధీమాతో బీజేపీ ఉన్నా ఇప్పుడున్న నాలుగు ఎంపీ స్థానాలను నిలుపుకోవడమే ఆ పార్టీ ప్రధాన లక్ష్యం.  గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు ఎంపీలూ ఓడిపోయారు. ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ లోక్‌‌‌‌‌‌‌‌సభ నియోజకవర్గం పరిధిలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో గెలవడం ఆ పార్టీకి ఉపశమనం. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు ప్రత్యామ్నాయం మేమే అంటూ అధికారంలోకి వచ్చేశామని భ్రమల్లో తేలిన బీజేపీ ఎన్నికల్లో భంగపాటుకు గురయ్యింది.

తెలంగాణ బీజేపీలో అనైక్యత

తెలంగాణలో 8 నుంచి-10 ఎంపీ స్థానాలను గెలవాలనే లక్ష్యాన్ని బీజేపీ అధిష్టానం నిర్దేశించింది. రాబోయే లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో  మోదీ చరిష్మా, అయోధ్య రామాలయం అంశాలతో అధిక స్థానాలు సాధిస్తామనే భావనతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ లేవనెత్తిన బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ నినాదాలు విఫలమయ్యాయి. ఎస్సీ సామాజికవర్గం ఓట్లపై కన్నేసిన బీజేపీ వర్గీకరణ కోసం కమిటీని వేసింది. తెలంగాణలో ఆ పార్టీకి ప్రధాన సమస్య నాయకుల్లో సఖ్యత లేకపోవడమే.  రెండు నెలల కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం, రెండుసార్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, పదేండ్లు  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య తెలంగాణలో త్రిముఖ పోటీ నెలకొంది. పీపుల్స్‌‌‌‌‌‌‌‌ పల్స్‌‌‌‌‌‌‌‌ బృందం క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసినప్పుడు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌  ముందంజలో ఉండగా, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ రెండో స్థానం కోసం పోటీపడుతున్నాయి. ఇటీవల ఏర్పడిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం గ్యారంటీలపై ప్రజల్లో నమ్మకం కొనసాగుతుందా? కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ వెలికితీస్తున్న గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలు ఎలా స్పందిస్తారు?. రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం తీసుకున్న సున్నితమైన అంశాలను ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారు? అనే అంశాలతో తెలంగాణలో లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికలు రెఫరెండంగా జరగనున్నాయని చెప్పవచ్చు.

సీఎం రేవంత్​పై ఎన్నికల ఒత్తిడి

ముఖ్యమంత్రి రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డితోపాటు రాష్ట్ర మంత్రులకు కూడా లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల ఒత్తిడి తప్పడంలేదు.  రాష్ట్ర మంత్రులు  గెలిచిన అసెంబ్లీ సెగ్మంట్‌‌‌‌‌‌‌‌తోపాటు ఆ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఎంపీ స్థానాన్ని గెలవడం కూడా వీరికి కీలకమే. వీటికి అదనంగా ఒక్కో మంత్రికి లోక్‌‌‌‌‌‌‌‌సభ నియోజకవర్గాల బాధ్యతలను ప్రత్యేకంగా అప్పగించారు. వారి నియోజకవర్గంతోపాటు వారికి అప్పగించిన చోట కూడా లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల ఫలితాల్లో తేడా వస్తే మాత్రం ప్రభుత్వంతో పాటు పార్టీలో కూడా వారి పరపతి తగ్గుతుంది. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రధానంగా ఆరు గ్యారంటీల హామీపైనే నమ్మకం పెట్టుకుంది. కష్టమైనా, నష్టమైనా ఆరు గ్యారంటీలను పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ఎన్నికలలోపు విజయవంతంగా కొనసాగించాలనే పట్టుదలతో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా పడిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు సాధించకపోతే పార్టీ ఉనికికే ప్రమాదం. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పదేండ్ల పాలనపై గతాలను తవ్వుతూ టార్గెట్‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. మరోవైపు తొమ్మిది మంది సిట్టింగ్‌‌‌‌‌‌‌‌ ఎంపీలలో కొందరు పార్టీ గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు మధ్య ఓట్ల వ్యత్యాసం రెండు శాతం మాత్రమేనని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అధినేతలు సర్ది చెప్పుకుంటున్నా.. 2018 ఎన్నికల్లో 18 శాతం ఓట్ల వ్యత్యాసంతో రెండోసారి పగ్గాలు చేపట్టిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ 2023లో అధికారాన్నే కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడిందనే వాస్తవాన్ని మర్చిపోతున్నారు.

- ఐ.వి. మురళీకృష్ణ శర్మ,
రీసెర్చర్‌‌‌‌‌‌‌‌, పీపుల్స్‌‌‌‌‌‌‌‌పల్స్‌‌‌‌‌‌‌‌ 
రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ సంస్థ.