లోక్ సభ ఎన్నికలు: ఖమ్మంలో టైట్ ఫైట్

 లోక్ సభ ఎన్నికలు: ఖమ్మంలో టైట్ ఫైట్

రాష్ట్రమంతటా రాజకీయం ఒకలెక్క ఉంటె..ఖమ్మంల మరో తీరుగ ఉంటదని ఇప్పటిదాకా జరిగిన ఎన్నికలు రుజువు చేశాయి. ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట, తర్వాత కాంగ్రెస్ కు పెట్టని కోట.. మధ్యలో టీడీపీ, వైఎస్సార్ సీపీని ఆదరించిన ఖమ్మం ఓటర్లు ఎప్పటికప్పుడు విలక్షణ తీర్పు నిస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర మంతటా క్లీన్ స్వీ ప్ చేసిన టీఆర్ ఎస్ కు ఈజిల్లాలో మాత్రం ఒక్క సీటే దక్కింది. కానీ ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ఆకర్షించటంతో సీన్ మారిపోయింది. ఆ పార్టీ సంఖ్యాబలం పెరిగింది. అయితే తమ తీర్పు కు భిన్నం గా ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయిం చిన  తీరుపై.. ఆయా పార్టీల కేడర్, ఓటర్లలో అంతర్మథనం మొదలైంది. అందుకే ఖమ్మం లోక్ సభ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఇండిపెండెంట్లతో కలిపి ఇక్కడ 27 మంది బరిలో ఉన్నా.. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యనే టైట్ ఫైట్ కనిపిస్తోం ది. కాంగ్రెస్ తమ అభ్యర్థిగా సీనియర్​ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరినిపోటీకి దింపింది. టీఆర్ఎస్ ఆఖరి నిమిషంలో టీడీపీ నుంచి వచ్చిన మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు టికెట్ ఇచ్చిం ది. ఈ అభ్యర్థులిద్దరూ గతంలో ఇదే సీట్లో ముఖాముఖి తలపడి చెరోసారి గెలి చారు. మూడోసారి నువ్వా, నేనా అన్నట్టుగా పోటీ అనివార్యమైం ది.

టికెట్లతో టీఆర్ఎస్ ట్విస్టులు….

ఖమ్మం లోక్ సభ స్థానంలో టీఆర్​ఎస్ ఇప్పటివరకు గెలవలేదు. ఈసారి ఎలాగైనా బోణీ కొట్టాలని ఆ పార్టీ స్కెచ్ వేసింది. అసెంబ్లీ ఎన్నికలై పోగానే ముఖ్యమంత్రి స్వయంగా దీనిపై దృష్టి పెట్టారు . ఈ లోక్ సభ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో ఒక్కసీటునే టీఆర్​ఎస్ సొంతంగా గెలుచుకుంది. మిగతా సీట్లలో గెలి చిన ఒక ఇండిపెండెంట్, ఇద్దరు కాంగ్రెస్, ఓ టీడీపీ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడంతో టీఆర్​ఎస్ బలం ఐదుకు పెరిగిం ది. అదే జోరుతో సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివా స్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. ఖమ్మం అసెంబ్లీ స్థానంలో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిన నామా నాగేశ్వరరావును చేర్చుకొని టికెట్ ఇచ్చింది. ఈ వరుస ట్విస్టులతో జిల్లాలో టీఆర్​ఎస్ కేడర్​ సైతం నివ్వె రపోయింది. గత ఎన్నికల్లో వైస్సార్​సీపీ నుంచి గెలి చి టీఆర్​ఎస్ లో చేరిన పొంగులేటికి చివరి నిమిషంలో టికెట్ నిరాకరించడంతో ఆయన వర్గీయులు సైలెంటయ్యారు. గత లోక్ సభ పోరులో పొంగులేటి చేతిలో ఓడిన నామాకు ఇప్పుడు టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పొంగులేటి సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటు న్నారు . మరోవైపు కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు, టీడీపీ నుంచి వచ్చిన పార్టీ అభ్యర్థికి , కేడర్​కు మధ్య గ్యాప్ ఉండటం అధికార పార్టీకిఇబ్బందికరంగా మారింది. వచ్చే నెల 4న ఖమ్మం సభకు కేసీఆర్ రానుండటంతో పార్టీ నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నామా 2004 నుంచి 2014 వరకు మూడు సార్లు టీడీపీ నుంచి ఖమ్మం లోక్ సభకు పోటీ చేసి, ఒకసారి గెలి చారు. తొలిసారిగా టీఆర్​ఎస్ నుంచి బరిలో ఉన్నారు . 2014 ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ నాలుగో స్థానానికే పరిమితమైంది. ఈ నేపథ్యం లో నియోజకవర్గం లో బాగా పరిచయాలున్న నామాను దింపడం కలిసొస్తుం దని టీఆర్​ఎస్ భావిస్తోం ది.

మేమూ ఉన్నామంటున్న బీజేపీ….

దేశవ్యాప్తంగా జోరు మీదున్న బీజేపీ కూడా ఖమ్మంకు చెందిన దేవకి వాసుదేవరావును పోటీలో నిలి పింది. తమ ప్రత్యేక ఓటు బ్యాంకు తో పాటు మోడీ చరిష్మా కలి సొస్తుం దని.. యువకులు, విద్యావంతులు అండగా ఉంటారని ధీమాతో ఉన్నారు .