కర్నాటకలో లోకాయుక్త సోదాలు.. 12 మంది ప్రభుత్వ అధికారులు.. 38 కోట్లు పోగేశారు !

కర్నాటకలో లోకాయుక్త సోదాలు.. 12  మంది ప్రభుత్వ అధికారులు.. 38 కోట్లు పోగేశారు !

హవేరి: కర్నాటకలోని హవేరిలో కోటి రూపాయల అవినీతి బాగోతం బట్టబయలైంది. హవేరి పరిధిలోని రాణెబెన్నూర్లో ఉన్న రెవెన్యూ ఇన్ స్పెక్టర్ అశోక్ అరలేశ్వర్ నివాసంలో లోకాయుక్త చేసిన తనిఖీల్లో భారీగా నగదు, కోటి రూపాయల విలువైన బంగారం, ఆభరణాలు దొరికాయి. లోకాయుక్త డిప్యూటీ ఎస్పీ మధుసూదన్ నేతృత్వంలో ఈ సోదాలు జరిగాయి. ఒక్క రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ ఆస్తులపై మాత్రమే కాదు కర్నాటక వ్యాప్తంగా 12 మంది ప్రభుత్వ అధికారుల నివాసాలపై, వారి సన్నిహితుల ఇళ్లపై లోకాయుక్త పోలీసులు ఏకకాలంలో తనిఖీలు చేశారు. 38 కోట్లు విలువైన అక్రమాస్తులను గుర్తించారు. బెంగళూరు, చిత్రదుర్గ, దావణగెరె, హవేరి, బీదర్, ఉడుపి, బాగల్ కోటె, హసన్ ప్రాంతాల్లో లోకాయుక్త సోదాలు జరిగాయి.

కర్నాటకలో మొత్తం 48 ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. ఈ 12 మంది ప్రభుత్వ అధికారుల్లో అత్యధికంగా 7 కోట్ల 32 లక్షల అక్రమాస్తులను వి.సుమంగళ అనే ప్రభుత్వ అధికారి ( స్టేట్ స్కూల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్) ఇంట్లో, బంధువుల నివాసాల్లో గుర్తించినట్లు లోకాయుక్త తెలిపింది. బెంగళూరులోని ఆమె ఇంటితో సహా మొత్తం ఆమెకు సంబంధించిన 6 ప్రాంతాల్లో లోకాయుక్త సోదాలు జరిపింది. ఆమె అక్రమాస్తుల విషయానికొస్తే.. ఐదు సైట్లు, ఐదు ఇళ్లు, 19 ఎకరాల వ్యవసాయ భూమి.. వీటి విలువ సుమారు 5 కోట్ల 8 లక్షలు ఉందని లోకాయుక్త అధికారులు తెలిపారు.

ఇక మిగిలిన 11 మంది ప్రభుత్వ అధికారుల అక్రమాస్తుల విషయానికొస్తే.. మంజునాథ జి, మెడికల్ ఆఫీసర్, మెటర్నిటీ హాస్పిటల్, మల్లసంద్ర, బెంగళూరు (రూ. 3.24 కోట్లు).. NK గంగామరిగౌడ, సర్వేయర్, KIADB, బెంగళూరు (రూ. 4.66 కోట్లు).. ఎన్ చంద్రశేఖర్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, హోల్‌కెరె, చిత్రదుర్గ (రూ. 5.14 కోట్లు).. జగదీష్ నాయక్ KH, అసిస్టెంట్ ఇంజనీర్, KRIDL, దావణగెరె (రూ. 2.04 కోట్లు).. B S నడువిన మానె, జూనియర్ అసిస్టెంట్, ఆహార, పౌర సరఫరాలు & వినియోగదారుల వ్యవహారాల శాఖ, దావణగెరె (రూ. 2.30 కోట్లు).. బసవేష్ శివప్ప షిడేనూర్, ఇంచార్జి ఈఓ, సవనూరు తాలూకా పంచాయతీ, హావేరి (రూ. 1.67 కోట్లు).

అశోక్ శంరప్ప అరలేశ్వర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, తాలూకా కార్యాలయం, రాణేబెన్నూరు, హావేరి (రూ. 2.25 కోట్లు).. ధూలప్ప అసి. డైరెక్టర్, ఉద్యానవన శాఖ, ఓరాడ్, బీదర్ (రూ. 3.39 కోట్లు).. లక్ష్మీనారాయణ పి నాయక్, ఆర్టీఓ, ఆర్టీఓ కార్యాలయం, ఉడిపి (రూ. 2.21 కోట్లు).. చేతన్, జూనియర్ ఇంజనీర్, కెబిజెఎన్ఎల్, ఎఆర్బిసి, డివిజన్-2, కామటగి, బాగలకోటే (రూ. 1.67 కోట్లు).. జ్యోతి మేరి, ఎఫ్డిఎ, అకౌంట్ సెక్షన్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, హసన్ (రూ. 2.17 కోట్లు). ఇదీ.. కర్నాటకలో ప్రభుత్వ శాఖల్లో ఉన్నత స్థాయిలో కొనసాగుతూ కోట్లు దోచుకున్న 12 మంది అక్రమాస్తుల చిట్టా.