భారత్‌కు చెందిన విస్తారా ఎయిర్ లైన్స్‌కు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. దాదాపు 290 మంది ప్రయాణికులతో లండన్ నుంచి ఢిల్లీ బయలుదేరిన విస్తారా విమానానికి బుధవారం(అక్టోబర్ 09) ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. విమానంలోని వాష్‌రూమ్‌లో ఓ టిష్యూ పేపర్‌పై విమానం పేల్చేయబోతున్నామని రాసి ఉన్నట్లు సిబ్బంది కనుగొన్నారు.
వెంటనే విమాన సిబ్బంది సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ఈ పరిణామం అనంతరం ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆపై భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించి తనిఖీల కోసం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు.
ఈ ఘటనపై విస్తారా ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. లండన్ నుండి ఢిల్లీ వెళ్తున్న విస్తారా ఫ్లైట్ UK 018లో భద్రతాపరమైన ఆందోళనను మా సిబ్బంది గుర్తించారు. ప్రోటోకాల్‌ను అనుసరించి సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించాం. ప్రయాణికులు సురక్షితంగా కిందకు దిగాక విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించాం.." అని తెలిపారు.
ALSO READ | మధ్యప్రదేశ్లో రైలు పట్టాలపై ఐరన్ ఫ్రేమ్..తప్పిన పెను ప్రమాదం