ఘట్ కేసర్, వెలుగు: ఎలాంటి పర్మిషన్లు లేకుండా లారీలో ఎద్దులను కుక్కి తరలిస్తుండగా ఘట్ కేసర్ పోలీసులు సీజ్ చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. ఇన్ స్పెక్టర్ ఎస్. సైదులు తెలిపిన ప్రకారం.. యాదాద్రి జిల్లా కొండమడుగు నుంచి సిటీలోని కబేళాకు లారీలో క్రూరంగా ఎద్దులను తరలిస్తున్నట్లు సమాచారం అందింది. వెంటనే పోలీసులు టౌన్ లోని ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ప్లాజా వద్ద ఆ లారీని ఆపారు.
అందులో 6 ఎద్దులను కుక్కి తరలిస్తుండగా సీజ్ చేశారు. పెద్ద అంబర్ పేట్ కు చెందిన చిలివేరు లక్ష్మయ్యను అదుపులోకి తీసుకున్నట్టు ఇన్ స్పెక్టర్ తెలిపారు. ఎద్దులను జియాగూడలోని గోశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.
