పొట్ట కూటి కోసం వచ్చి కార్మికులు ప్రాణాలు కోల్పోవడం బాధకరం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

పొట్ట కూటి కోసం వచ్చి కార్మికులు ప్రాణాలు కోల్పోవడం బాధకరం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటన చాలా దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం (జూలై 1) ఆయన ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సిగాచి పరిశ్రమ ఫార్మా కంపెనీలకు రా మెటీరియల్ సప్లై చేస్తుందని తెలిపారు. ఘటన స్థలంలో కొన్ని మృతదేహాలు ఇప్పటికే లభించాయని.. ఇంకా 11 మంది ఆచూకీ తెలియడం లేదన్నారు. గతంలో కూడా ఓ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ వల్ల 11 మంది చనిపోయారని.. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం ప్రభుత్వం అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు.

ALSO READ | మేడ్చల్ జిల్లాలో పేలుడు.. ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా పేలిన బాయిలర్

 పొట్ట కూటి కోసం వచ్చి కార్మికులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని.. ప్రమాద బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమల్లో తనిఖీలు లంచాల కోసం జరుగుతున్నాయా.. నామ్ కే వాస్త్  ప్రకారం జరుగుతున్నాయా అని ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలని హితవు పలికారు. సిగాచి యాజమానానికి మరో 3 పరిశ్రమలు ఉన్నాయని... ఇప్పటికైనా అన్నింటిని తనిఖీ చేయాలని చెప్పారు. 

మృతుల జాబితా వచ్చిన తరువాత ఆయా రాష్ట్రాల వారికి మా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మిస్ అయిన వారి ఆచూకీ ప్రభుత్వం త్వరగా తెలుసుకోవాలన్నారు. శిథిలాల కింద మృతదేహాల గుర్తింపు కోసం పోలీస్ డాగ్స్‎ని ఉపయోగించాలన్నారు. పరిశ్రమల ప్రాంతంలో కచ్చితంగా అంబులెన్స్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. చనిపోయిన కుటుంబాల సభ్యులు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతామంటే సహకరిస్తామని.. కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.