మేడ్చల్ జిల్లాలో పేలుడు.. ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా పేలిన బాయిలర్

మేడ్చల్ జిల్లాలో పేలుడు.. ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా పేలిన బాయిలర్

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి కంపెనీలో బాయిలర్ పేలి 42 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటన స్థలంలో ఇంకా సహయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగానే తాజాగా రాష్ట్రంలో మరో పేలుడు చోటు చేసుకుంది. మంగళవారం (జూలై 1) మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించింది. 

ALSO READ | చనిపోయిన ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం : సీఎం రేవంత్ రెడ్డి

ఆల్కలైడ్స్ బయో అక్టీవ్స్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా బాయిలర్ పేలింది. ఈ ఘటనలో కార్మికుడు గన్నారం శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. తోటి కార్మికులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మరికొందరు కార్మికులు స్వల్పంగా గాయపడ్డట్లు సమాచారం. బాయిలర్ పేలుడు ధాటికి కార్మికులు భయబ్రాంతులకు గురై.. బయటకు పరుగులు తీశారు.

 స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాయిలర్ పేలుడికి గల కారణాలు ఏంటని ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.