వానలకు కూరగాయ పంటలు ఆగం

వానలకు కూరగాయ పంటలు ఆగం

హైదరాబాద్ ​చుట్టుపక్కలే 30 వేల ఎకరాలకు పైగా నష్టం
రైతులకు లక్షల్లో పెట్టుబడి లాస్​
టమాటకు పెద్ద దెబ్బ.. 4 వేల క్వింటాళ్లకు పడిపోయిన ఉత్పత్తి
ఇతర రాష్ట్రాల నుంచి వేల క్వింటాళ్ల దిగుమతి


హైదరాబాద్‌, వెలుగు: తెరిపిలేకుండా పడ్డ వానలతో రాష్ట్రంలో కూరగాయల పంటలకు తీవ్ర నష్టం జరిగింది. టమాట, బీర, దోస, కాకర, పొట్లకాయ తోటలతోపాటు కొత్తిమీర, పాలకూర, తోటకూర పంటలు వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. రంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, నల్గొండ జిల్లాల రైతులు సీజన్​తో సంబంధం లేకుండా.. ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తూ.. హైదరాబాద్​కు తరలిస్తుంటారు. ఇటీవలి వర్షాలకు ఈ జిల్లాల పరిధిలో దాదాపు 30 వేల ఎకరాలకు పైగా తోటలన్నీ ధ్వంసమయ్యాయి. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు వానల కారణంగా నిండా మునిగారు. ప్రకృతి విపత్తులతో నష్టం జరిగితే గతంలో హార్టికల్చర్‌‌ శాఖ ఆదుకునేది. రాష్ట్రం వచ్చాక వర్షాలతో పంటలకు ఎంత నష్టం జరిగినా సర్కారు కనీసం పట్టించుకోవడం లేదు. హైదరాబాద్​ చుట్టు పక్కల జిల్లాల వారు కూరగాయలే పండించాలని గతంలో ఎన్నోసార్లు చెప్పిన సీఎం కేసీఆర్..​ ఇప్పుడు వానలతో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతే కనీసం నష్టం అంచనా వేసేందుకు కూడా ఆఫీసర్లను ఆదేశించడం లేదు. వర్షాల ఎఫెక్ట్​తో హైదరాబాద్​కు జిల్లాల నుంచి వచ్చే లోకల్ ​కూరగాయల వాటా భారీగా పడిపోయింది. వర్షాలకు ముందు రోజుకు 7 వేల క్వింటాళ్ల వరకు టమాట వచ్చేది.. ఇప్పుడది 4 వేల క్వింటాళ్లకు పడిపోయింది. దీంతో ఏపీ, కర్నాటక, మహారాష్ట్రల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.   
టమాటకు పెద్ద దెబ్బ..
విడువకుండా కురిసిన వర్షాలతో పొలాల్లో పెద్ద ఎత్తున వరద పారింది. టమాట పంట నీట మునిగి కుళ్లిపోయింది. వానలకు పచ్చికాయకు కూడా పగుళ్లు రావడంతో టమాట సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. సర్కారు కూరగాయలు సాగుకు ప్రోత్సాహం ఇవ్వకపోగా, పంట నష్టం జరిగితే కనీసం పరిహారం కూడా ఇవ్వడం లేదు. హైబ్రీడ్ ​విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, దున్నకాలు ఇలా ఒక ఎకరానికి లక్షల పెట్టుబడి పెట్టిన రైతులు.. దారుణంగా నష్టపోయారు. రంగారెడ్డి, వికారాబాద్​జిల్లాల్లో రైతులు పెద్ద ఎత్తున ఆకుకూరలు సాగు చేస్తారు. మొన్నటి వర్షాలకు కొత్తిమీర, పాలకూర, తోటకూర పొలాల్లోనే మురిగిపోయాయి. రైతులకు పెట్టుబడి డబ్బులు కూడా రాలేదు. గతంలో కూరగాయల పంటలకు నష్టం జరిగితే ఎకరానికి రూ.5 వేల వరకు హార్టికల్చర్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ సాయం అందించేది. కూరగాయల విత్తనాలు కూడా సబ్సిడీ మీద సరఫరా చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం కూరగాయల రైతులను పట్టించుకోవడం లేదు.
లోకల్‌‌ లోడ్లు తగ్గినయ్‌‌
వర్షం ఎఫెక్ట్​తో లోకల్ ​కూరగాయలు మార్కెట్‌‌కు రావడం తగ్గిపోయింది. శుక్రవారం182 డీసీఎంలు, 22 లారీల్లో కూరగాయలు మార్కెట్‌‌కు రాగా రాష్ట్రంలోని లోకల్‌‌ కూరగాయలు 21 డీసీఎంలు, 64 టాటా ఏసీ వాహనాల్లో మాత్రమే వచ్చాయి. ఏపీ నుంచి 83 డీసీఎంలు, కర్ణాటక నుంచి 40 డీసీఎంలు, 3 లారీలు, మహారాష్ట్ర నుంచి 29 డీసీఎంలు, 7 లారీల్లో దిగుమతి అయ్యాయి. శనివారం మొత్తం156 డీసీఎంలు, 23 లారీల్లో కూరగాయలు మార్కెట్‌‌కు రాగా  ఏపీ నుంచి 64 డీసీఎంలు, ఒక లారీలో వచ్చాయి.  రాష్ట్రం నుంచి 30 డీసీఎంలు మాత్రమే వచ్చాయి. ఆదివారం మొత్తం180 డీసీఎంలు, 22 లారీల్లో కూరగాయలు రాగా.. రాష్ట్రం నుంచి కేవలం 15 డీసీఎంలు మాత్రమే వచ్చాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతుండటంతో వెజిటేబుల్స్‌‌ షార్టేజ్‌‌ ప్రమాదం తప్పుతోంది. మార్కెట్‌‌కు లోకల్‌‌ టమాట గణనీయంగా తగ్గిపోయింది. ఆదివారం సంగారెడ్డి, గద్వాల, శామీర్​పేటల నుంచి కేవలం 172 క్వింటాళ్ల టమాట మాత్రమే మార్కెట్‌‌కు వచ్చింది. ఏపీలోని డోన్‌‌, కర్నూల్‌‌, అనంతపురం, కల్యాణదుర్గం నుంచి, కర్నాటకలోని చింతామణి, బాగేపల్లి, మహారాష్ట్రలోని లాతూర్‌‌, షోలాపూర్‌‌ల నుంచి 3,398 క్వింటాళ్ల టమాట దిగుమతి అయింది. బోయిన్‌‌పల్లి, గజ్వేల్‌‌, సంగారెడ్డి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్‌‌నగర్‌‌లు కలిపి ఈ నెల ప్రారంభంలో 7 వేల క్వింటాళ్ల వరకు టమాట మార్కెట్‌‌కు దిగుమతి అయ్యేది. ప్రస్తుతం 4,179 క్వింటాళ్లకు పడిపోయింది. 


రైతులను ఆదుకోవాలె..
ఎకరానికి రూ.2 లక్షల దాకా పెట్టుబడి పెట్టి12 ఎకరాల్లో టమాట వేసిన. బీరకాయ 6 ఎకరాలు, కాకరకాయ 3 ఎకరాలు వేశా. వర్షాలకు పంటలు మొత్తం నాశనమయ్యాయి. వర్షాలకు ఆగమైన  రైతులను సర్కారు ఆదుకోవాలె. గతంలో విత్తనాలు కూడా  సబ్సిడీకి ఇచ్చేది. ఇప్పుడు ఏ సాయం అందడం లేదు.                                                                                                                                         ‑ మహ్మద్‌‌ అనీఫ్‌‌, టమాట రైతు, సంగారెడ్డి జిల్లా 

హైదరాబాద్‌, వెలుగు: తెరిపిలేకుండా పడ్డ వానలతో రాష్ట్రంలో కూరగాయల పంటలకు తీవ్ర నష్టం జరిగింది. టమాట, బీర, దోస, కాకర, పొట్లకాయ తోటలతోపాటు కొత్తిమీర, పాలకూర, తోటకూర పంటలు వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. రంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, నల్గొండ జిల్లాల రైతులు సీజన్​తో సంబంధం లేకుండా.. ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తూ.. హైదరాబాద్​కు తరలిస్తుంటారు.