- హోరాహోరీ పోరు సాగిన గ్రామాల్లో చివరి వరకు ఉత్కంఠ
- అభ్యర్థులిద్దరికీ సరిసమానం ఓట్లు వచ్చిన చోట్ల లాటరీ ద్వారా విజేతల ఎంపిక
- లాటరీతో, ఒక్క ఓటుతో విజయం చేజారిన చోట్ల అభ్యర్థుల కన్నీరుమున్నీరు
వెలుగు, నెట్వర్క్:ఒక్క ఓటే కదా ? అని తేలిగ్గా తీసుకుంటాం. కానీ పలు గ్రామాల్లో ఆ ఒక్క ఓటే విజేతను తేల్చింది. ప్రత్యర్థి కంటే ఆ ఒక్క ఓటు సైతం ఎక్కువ రాని చోట్ల.. అంటే ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులకు సరిసమానం ఓట్లు వచ్చిన చోట్ల లాటరీ ద్వారా విజేతను ఎంపిక చేయాల్సి వచ్చింది. ఆయా గ్రామాల్లో, వార్డుల్లో నువ్వా.. నేనా అన్నట్లు సాగిన ఓట్ల లెక్కింపులో చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా పలు గ్రామాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోగా, గట్టెక్కినవాళ్లు సంబరాల్లో మునిగిపోతే, అడుగుదూరంలో విజయం చేజారినవాళ్లు కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు అనేక గ్రామాల్లో సర్పంచ్అభ్యర్థులు కేవలం 10 లోపు ఓట్లతో బయటపడడం విశేషం.
- > వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని గోపనపెల్లి బెల్లం రజితకు 587 ఓట్లు రాగా, నాంపెల్లి విజయఅశోక్కు 596 ఓట్లు వచ్చాయి. దీంతో 9 ఓట్ల తేడాతో విజయ అశోక్ విజయం సాధించారు. గోరుగుట్టతండా జీపీలో కాంగ్రెస్ బలపరిచిన బానోతు విజయలక్ష్మి 8 ఓట్లతో బానోతు లలితపై విజయం సాధించింది.
- > మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం సౌళ్లతండా గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గుగులోత్ సుజాత వాసు 15 ఓట్ల తేడాతో గెలిచారు.
- >ఖమ్మం జిల్లా లక్ష్మీపురం సర్పంచ్ క్యాండిడేట్ తల్లపురెడ్డి నాగిరెడ్డి మూడు ఓట్ల తేడాతో కామసాని శ్రీనివాసరెడ్డిపై విజయం సాధించారు.
- >మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని తెలుగుగూడెం పంచాయతీలో ఇండిపెండెంట్ క్యాండిడేట్ హుసేనయ్యకు 172 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ బలపరిచిన క్యాండిడేట్‌కు 171 ఓట్లు వచ్చాయి. దీంతో హుసేనయ్య గెలిచినట్లు ప్రకటించారు. కానీ బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి రీకౌంటింగ్ కోరాడు. ఆఫీసర్లు రీ కౌంటింగ్ చేపట్టగా... హుసేనయ్యకు నాలుగు ఓట్ల మెజార్టీ దక్కింది.
- > భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలంలోని కొత్తపల్లి (కె)లో 7 ఓట్ల మెజార్టీతో బీఆర్‌ఎస్ క్యాండిడేట్ జువ్వాజీ రమేశ్ సర్పంచ్‌గా గెలిచారు.
- > ఖమ్మం జిల్లా గణేశ్వరం గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగ ఐదు ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్ క్యాండిడేట్ కొర్ర తులిస్యపై విజయం సాధించారు.
- > బోధన్ మండలం కల్దుర్కిలో సర్పంచ్ క్యాండిడేట్లు నరేందర్‌రెడ్డికి 866, న్యాలం శ్రీనివాస్‌కు 863 ఓట్లు వచ్చాయి. దీంతో శ్రీనివాస్ రీకౌంటింగ్ కోరగా.. అప్పుడు నరేందర్‌రెడ్డికి 861, శ్రీనివాస్‌కు 860 ఓట్లు వచ్చాయి. దీంతో శ్రీనివాస్ మరోసారి లెక్కించాలని కోరగా అప్పుడు కూడా నరేందర్‌రెడ్డికి ఒక ఓటు ఎక్కువ వచ్చింది. దీంతో అతడు గెలిచినట్లు ఆఫీసర్లు ప్రకటించారు.
- > కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రేవెల్లి సర్పంచ్‌గా బందారపు అజయ్‌కుమార్ గౌడ్ ఆరు ఓట్ల తేడాతో ఊకంటి రాజిరెడ్డిపై విజయం సాధించారు.
- > గద్వాల జిల్లా గట్టు మండలం రాయపురంలో సర్పంచ్ క్యాండిడేట్లు పద్మకు 685 ఓట్లు, గోవిందమ్మకు 688 ఓట్లు వచ్చాయి. దీంతో మూడు ఓట్ల తేడాతో గోవిందమ్మ విజయంసాధించారు.

