ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెదక్ (చిన్నశంకరంపేట), వెలుగు: కొత్త ఏడాదిలో రాష్ట్రమంతా కమలం వికసించాలని బీజేపీ  జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి ప్రజలను కోరారు. శనివారం మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలుజల్లి నివాళులర్పించారు. బీజేపీ జెండా ఆవిష్కరించి, పార్టీ కొత్త ఆఫీస్​ను  ప్రారంభించారు. అనంతరం మెదక్ మండలం ఖాజీపల్లిలో కాలభైరవ స్వామి ఆలయ వార్షికోత్సవాలకు హాజరై  బోనమెత్తి స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ మెదక్ ప్రజలతో తనకు చాలా అనుబంధం ఉందని గుర్తుచేశారు. గతంలో తాను మెదక్ ఎంపీగా ఉన్నప్పుడు రైల్వే లైన్ కోసం కృషి చేశానని తెలిపారు. తాను శివ భక్తురాలని కాబట్టి కాశీకి వెళ్లే మొక్కు ఉందని, అంతకుముందు కాలభైరవుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాలభైరవ స్వామి గుడి ఎంతో చారిత్రాత్మక దేవాలయమని, దీనికి పూర్వ వైభవం తీసుకు వచ్చినందుకు న్యాయవాది తాళ్లపల్లి రాజశేఖర్ ను అభినందించారు. ఆమెను యువక మండలి సభ్యులు గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి విజయ్​, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు మల్లారెడ్డి, నందారెడ్డి, చిన్నశంకరంపేట మండల అధ్యక్షుడు పోగుల రాజు ఉన్నారు. 

‘మల్లన్న’ కల్యాణానికి అంతా సిద్ధం

సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు :  కొమురవెల్లి మల్లన్న కల్యాణానికి అధికారులు అంతా సిద్ధం చేశారు. ఆదివారం నిర్వహించే ఈ కార్యక్రమానికి 30వేలకు పైగా భక్తులు తరలిరానున్నారు. అందుకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.  మంత్రులు, ఇతర ప్రముఖలు హాజరుకానుండటంతో పోలీసులు గట్టి బందోబస్తు కల్పిస్తున్నారు. తోటబావి వద్ద ఏర్పాటు చేస్తున్న కల్యాణ వేదిక పైన మంత్రులు ఎమ్మెల్యేలకు, కల్యాణ వేదిక పక్కన వీవీఐపీలకు, వేదిక ముందుభాగంలో వీఐపీలకు డోనర్స్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండగా సాధారణ భక్తులు తిలకించేందుకు అన్ని వైపులా ఎల్ఈడీ  స్ర్కీన్లను ఏర్పాటు చేస్తున్నారు.  కల్యాణ వేదిక, రాతిగీరల మండపం, కోడెల స్తంభంతోపాటు ఆలయ రాజగోపురానికి రంగులు వేయడంతో పాటు విద్యుత్ దీపాలతో అలంకరించడంతో మెరిసిపోతున్నాయి. భక్తుల దర్శనాల కోసం రాజగోపురం నుంచి హనుమాన్ దేవాలయం వరకు క్యూ లైన్లను సిద్దం చేశారు. తాగునీటి వసతి కల్పించారు. ఆలయ పరిసరాలను  నాలుగు సెక్టార్లుగా విభజించి 280 మంది పోలీసు సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి 80 సీసీ కెమెరాలతో పాటు అన్ని డిపార్ట్​మెంట్లను సమన్వయం చేసుకుంటూ భధ్రతను పర్యవేక్షిస్తున్నారు. ముగ్గురు ఎసీపీలు, 8 మంది సీఐలు, 14 మంది ఎస్సైలతో పాటు 250 మంది పోలీసులు బందోబస్తు లో పాల్గొంటున్నారు. తోటబావి ఎడమ వైపు వీఐపీలకు, చేర్యాల, కిష్టంపేటల నుంచి వచ్చే వాహనాలకు బస్టాండ్ సమీపంలో,  కొండ పోచమ్మ దేవాలయం వైపు నుంచి వచ్చే వాహనాలకు పద్మశాలి కల్యాణ మండపాల వద్ద ఖాళీ ప్రదేశాల్లో పార్కింగ్ కు ఏర్పాట్లు చేశారు. 

బంగారు కిరీటం..

మల్లన్న కల్యాణోత్సవంలో బంగారు కిరీటం,  బంగారు కోరమీసాలను స్వామివారికి అలంకరించనున్నారు.  గతేడాది మల్లికార్జునస్వామి కల్యాణోత్సవంలో మంత్రి హరీశ్​ రావు హామీ మేరకు సుమారు కిలోన్నరతో బంగారు కిరీటంతో పాటు బంగారు కోరమీసాలు ఏపీలోని తిరుపతిలో చేయించారు. ఆదివారం స్వామి కల్యాణం సందర్భంగా తిరుపతి నుంచి  తెప్పించి మండపంలో ప్రత్యేక పూజలు చేసి మంత్రి చేతుల మీదుగా స్వామికి అలంకరించనున్నట్లు తెలిసింది.

రెండు రోజులపాటు కల్యాణోత్సవాలు 

స్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా ఆది, సోమవారాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 18న ఉదయం 5 గంటలకు దృష్టి కుంభం, 10.45 కు మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం, రాత్రి 7 గంటలకు రథోత్సవం నిర్వహిస్తారు. 19న  ఉదయం  9 గంటలకు  ఏకాదశ రుధ్రాభిషేకం, లక్షబిల్వార్చన, మహా మంగళ హారతి మంత్ర పుష్ప కార్యక్రమాలను జరుగుతాయి.

ప్రతి రైతుకూ న్యాయం చేస్తాం

పటాన్​చెరు, వెలుగు : ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటులో భూములు కోల్పోతున్న ప్రతి రైతుకూ న్యాయం చేస్తామని పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం జిన్నారంలో  సర్వే నంబర్ 1 లో భూమి సేకరణపై ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో రైతులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం భూ సేకరణ సహజమని, ప్రభుత్వం నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించి అండగా నిలుస్తోందని తెలిపారు. జిన్నారంలో ని సర్వే నంబర్ 1లోని అసైన్డ్​ పట్టా కలిగిన రైతులకు అన్యాయం జరగబోదని స్పష్టం చేశారు. హెచ్ఎండీఏకు పూర్తిస్థాయిలో భూములు అప్పగించిన లే అవుట్ లో 600 గజాల స్థలాన్ని పూర్తిస్థాయి యాజమాన్య హక్కులతో ఇవ్వనున్నట్లు తెలిపారు. భూమికి బదులు భూమి కోరుతున్న రైతులకు పరిష్కారం చూపనున్నట్లు తెలిపారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఆర్డీఓ నగేశ్, ఎమ్మార్వో దశరథ్ సింగ్, బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు వెంకటేశ్​గౌడ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. 

పారదర్శకంగా ఫిజికల్ టెస్టులు

సంగారెడ్డి టౌన్, వెలుగు : సంగారెడ్డి పోలీస్ పరేడ్ గ్రౌండ్​లో వారం రోజులుగా నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్ ఫిజికల్​ టెస్టులు పారదర్శకంగా నిర్వహించినట్లు ఎస్పీ రమణ కుమార్​ తెలిపారు. శనివారంతో టెస్టులు ముగియగా చివరి రోజు 719 మంది పురుష, మహిళా అభ్యర్థులకు 627 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 237 మంది అభ్యర్థులు ఫైనల్ రాత పరీక్షలకు అర్హత సాధించినట్లు ఎస్పీ  తెలిపారు. 

సిద్దిపేటలో ఏర్పాట్లు పరిశీలించిన సీపీ

సిద్దిపేట రూరల్, వెలుగు : సిదిపేట సీపీ ఆఫీస్ ఆవరణలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ను శనివారం సీపీ శ్వేత పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల  22 నుంచి జనవరి 3 వరకు జరిగే పిజికల్​ టెస్టులను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 9,983 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. 

ఈనెల 24 న వాహనాల వేలం..

అన్నోన్ ప్రాపర్టీ కింద జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్  పరిధిల్లో 217 బైక్ లు, 20 ఆటోలు, 03 ఫోర్ వీలర్లతో కలపి మొత్తం 240 వాహనాలపై 102 సీఆర్పీసీలో  కేసు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు.  ఆరు నెలల నుంచి ఆ వాహనాల కోసం ఎవరు రానందున వాటిని అన్నోన్ ప్రాపర్టీగా పరిగణించి ఈనెల 24 న 11 గంటలకు పెద్ద కోడూరు గ్రామ శివారులోని సీఏఆర్ హెడ్ క్వార్టర్ లో వేలం వేయనున్నట్లు చెప్పారు

ఆఫీసర్లే డుమ్మా కొడ్తే.. అభివృద్ధి ఎట్లా? 

కొండాపూర్, వెలుగు : ‘మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల జనరల్ బాడీ మీటింగ్ కు అన్ని శాఖల ఆఫీసర్లు  ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో రాలేదు.. మున్ముందు అందరూ వస్తారన్న నమ్మకం లేదు. మరి పల్లెల అభివృద్ధి ఎట్లా?’ అని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఎంపీపీ మనోజ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మండల జనరల్ బాడీ మీటింగ్ లో అధికారుల తీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పంచాయతీ ఆఫీసర్ కు ఎంతమంది ఎంపీటీసీలు ఉన్నారో కూడా తెలియని దుస్థితి నెలకొందని, పల్లెభివృద్ధి, సంక్షేమ పథకాల్లో ప్రోటోకాల్ కు కూడా విలువ నివ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కరెంట్, ధరణి భూసమస్యల పరిష్కారం చూపాలని సభ్యుడు విజయ భాస్కర్ రెడ్డి సభా దృష్టికి తీసుకువచ్చారు. మల్లేపల్లి చెరువు, తెర్పోల్ పోయే చెరువు కట్ట రోడ్డుకు రూ. 2కోట్ల 60 లక్షల టెండర్ శాంక్షన్ అయిందని ఎంపీపీ వెల్లడించారు. జనరల్ బాడీ మీటింగ్ కంపల్సరీ  హాజరై సమస్యల పరిష్కారం, అభివృద్ధిపై దృష్టిపెట్టాలని, హాజరుకాని ఆఫీసర్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఎంపీపీ తెలిపారు. మీటింగ్ లో ఎంపీడీవో జయలక్ష్మి, ఎంపీటీసీలు సంతోష,  శ్రీనివాస్ గౌడ్ , రాందాస్, మమత, సర్పంచులు రాములు, పశు వైద్యాధికారి ఖన్షహిని బేగం, ఏఓ గణేశ్, వైద్యాధికారి రేష్మ, పీఆర్ఏఈ కృష్ణ ఉన్నారు.