ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రియాంక గాంధీ ఫోన్.. ఢిల్లీకి రావాలని పిలుపు

ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రియాంక గాంధీ ఫోన్.. ఢిల్లీకి రావాలని పిలుపు
  • పార్లమెంట్ సమావేశాల తర్వాత ఏఐసీసీ ఫోకస్..?

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై హైకమాండ్ సీరియస్ గా ఫోకస్ చేసింది. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తీరుపై గుర్రుగా ఉన్న అసమ్మతి నేతలు రేపు మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఈ పరిణామాలను గమనిస్తున్న పార్టీ హైకమాండ్.. పరిస్థితి ఏంటని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఆరా తీశారు. ఈ క్రమంలోనే ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రియాంకగాంధీ ఫోన్ చేసి మాట్లాడారు. ఏదైనా సమస్య ఉంటే ఢిల్లీ వచ్చి చెప్పాలని సూచించినట్టు తెలుస్తోంది. అసమ్మతి నేతలను హస్తిన రావాలని చెప్పినట్లు సమాచారం. 

రేపటి అసమ్మతి నేతల మీటింగ్ ను వాయిదా వేసుకోవాలని ప్రియాంకగాంధీ కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి వ్యవహార శైలితో చాలామంది నేతలు ఇబ్బందులు పడుతున్నారని  ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి  ప్రియాంకగాంధీకి చెప్పినట్టు సమాచారం. రేపటి మీటింగ్ గురించి అలాగే ఢిల్లీకి వచ్చే అంశంపై మిగతా నేతలతో మాట్లాడి చెప్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నట్టు తెలుస్తోంది. 

రేపు మహేశ్వర్ రెడ్డి ఇంట్లో భేటీ

మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇంట్లో రేపు భేటీ కావాలని ఇప్పటికే సీనియర్ నేతలు నిర్ణయించారు. ఈ మీటింగ్ కు ఎక్కువ మంది లీడర్లు హాజరయ్యేలా ప్లాన్ చేశారు. రేవంత్ రెడ్డి అంటే గిట్టని వారందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు అసమ్మతి వర్గం నేతలు ప్రయత్నిస్తున్నారు. మొన్న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇంటికి వచ్చిన వారితో పాటు అదనంగా మరికొంతమంది నాయకులు సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీని వీడే సమయంలో రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాగూర్ పై చేసిన కామెంట్స్ అన్నింటినీ ఫైల్ చేస్తున్నారు. రేపటి మీటింగులో రేవంత్ రెడ్డితో అమీతుమీ తేల్చుకోవాలని అసమ్మతి నేతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. మహేశ్వర్ రెడ్డి ఇంట్లో రేపు కాంగ్రెస్ అసంతృప్తి నేతల సమావేశం ఉంటుందా..? లేదా అనేది సస్పెన్స్ గా మారింది.