గత్యంతరం లేక లొంగిపోతే.. ఒప్పుకున్నట్లు కాదు

గత్యంతరం లేక లొంగిపోతే.. ఒప్పుకున్నట్లు కాదు
  • రేప్ కేసులో కేరళ  హైకోర్టు తీర్పు

కొచ్చి:  ‘‘ఒక అమ్మాయి ప్రేమలో ఉన్నంత మాత్రాన ప్రియుడితో సెక్స్​కు అంగీకరించినట్లు కాదు. నిస్సహాయ స్థితిలో గత్యంతరంలేక అమ్మాయి అడ్డు చెప్పకపోతే అది లైంగిక చర్యకు ఒప్పుకున్నట్లు కాదు” అని కేరళ హైకోర్టు స్పష్టంచేసింది. ఓ రేప్ కేసులో ట్రయల్ కోర్టు తనకు విధించిన శిక్షను రద్దు చేయాలంటూ నిందితుడు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు ఇటీవల విచారించింది. అంగీకారానికి, లొంగిపోవడానికి చాలా తేడా ఉందని తేల్చి చెప్పింది. శ్యామ్ శివన్ అనే యువకుడు 2013లో గర్ల్ ఫ్రెండ్ ను తన వెంట రావాలని, లేకపోతే ఆమె ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో బయటకు వచ్చిన ఆమెను మైసూర్​కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక చర్యకు పాల్పడిన తర్వాత నగలను అమ్మేశాడు. ఆ తర్వాత గోవాకు తీసుకెళ్లి అక్కడా అఘాయిత్యం చేశాడు. ఈ కేసులో అతడు అత్యాచారానికి పాల్పడ్డాడని ట్రయల్ కోర్టు తీర్పు చెప్పింది. ఆ అమ్మాయి తనతో ప్రేమలో ఉందని, ఆమె అంగీకారంతోనే సెక్స్ చేశానంటూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అడ్డు చెప్పకపోవడం అంగీకరించినట్లు కాదని, అది రేప్ కిందకే వస్తుందని హైకోర్టు తీర్పు చెప్పింది.