ఏ రోజుకారోజే..

ఏ రోజుకారోజే..

మనిషి జీవితం భయం చుట్టూనే తిరుగుతుంది. అవును.. భవిష్యత్తుని గురించి కన్న  కలల గురించి భయం. నిన్నటి నిజం రేపటి భవిష్యత్తుకి ఎక్కడ ఆటంకం అవుతుందోనన్న భయం. నిన్న జరిగిన అవమానం భయం.. దూరమైన తమవాళ్ల గురించి భయం.. దాన్నుంచి  పుట్టే బాధ భయం. కానీ, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ భయం, బాధ నిన్న జరిగిన వాటి గురించో లేదా రేపు జరగబోయే వాటి గురించో మాత్రమే. మరి ఆ రెండింటికీ మధ్యనున్న ఈరోజు పరిస్థితి ఏంటి? ఈరోజు సంతోషంగానే ఉన్నామా! ఒక్కసారి ఎవరికి వాళ్లు వాళ్ల మనసుతో మాట్లాడుకుని జవాబు చెప్పాలి.

ఓ అమ్మాయి చింతచెట్టు కింద దిగాలుగా కూర్చుంది. గట్టిగా ఏడుస్తుంటుంది. అది గమనించిన ఓ ఫిలాసఫర్​​ ఆమె దగ్గరికెళ్లి మాట్లాడించాడు. ఆమె మనసుని తేలిక చేయడానికి అతని జీవితంలో చోటు చేసుకున్న ఒక ఫన్నీ ఇన్సిడెంట్​ చెప్పాడు. అది విన్న ఆ అమ్మాయి కాసేపు కష్టాన్ని మర్చిపోయి కడుపుబ్బా నవ్వింది. దాంతో అతను అదే జోక్​ని మరో ఐదారుసార్లు చెప్పాడు. కానీ, చివరి మూడుసార్లు ఆమె ముఖంలో నవ్వు కనిపించలేదు. అప్పుడు ఆ ఫిలాసఫర్..‘ఇదే జోక్​ మొదటిసారి అంత నవ్వు తెప్పించింది కదా! మరి ఇప్పుడెందుకు ముభావంగా ఉన్నావు?’ అని అడిగాడు. దానికి ఆమె ‘ఒక్కటే జోక్​కి ప్రతిసారి నవ్వడానికి నేను ఏమైనా  పిచ్చిదాన్నా?’ అని అడిగింది.​ ‘మరి ఒక్కటే విషయాన్ని తలుచుకుని ఇన్నిసార్లు ఎలా ఏడుస్తున్నావు?’  అని అడిగాడు ఆ ఫిలాసఫర్​. ‘పైగా ఒక్కటే విషయాన్ని ఆలోచించి రేపు ఎలా ఉంటుందోనని ఇన్నిసార్లు ఎందుకు భయపడుతున్నావు?’ అని అడిగాడు. అతని ప్రశ్నలో తప్పేం లేదు కదా!  
సూర్యుడు ఉదయిస్తాడు
రేపటి ఊహలు, కలలు.. నిన్నటి చేదు జ్ఞాపకాలు..వీటి గురించి ఆలోచిస్తూ ఈరోజు. ఇది ఏ ఒక్కరి సమస్యో కాదు. దాదాపుగా మనుషులందరిదీ ఇదే పరిస్థితి. కొందరు భవిష్యత్తుని గురించి ఏవేవో కలలు కంటుంటారు. మరికొందరేమో గడిచిపోయిన కాలంలోనే ఉండిపోతుంటారు. కానీ, ఒక్కసారి ఆలోచించండి..మనం ఆలోచించడం వల్ల గడిచిన కాలాన్ని కొంచెమైనా మార్చగలిగామా? అలాగని భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఏమైనా ప్రయోజనం వచ్చిందా?. ఈ రెండింటి మధ్య ఈరోజుని మన:స్ఫూర్తిగా గడిపారా? కచ్చితంగా ‘లేదు’ అనే జవాబు వస్తుంది. అందుకే ఈరోజు గురించి మాత్రమే ఆలోచించాలి. ఈ రోజుని ఎంత అందంగా, ఎంత ఆనందంగా మార్చుకోవాలో ఆలోచించాలి. ఈరోజుని పూర్తిగా ఆస్వాదించాలి. అప్పుడే గడిచిన కాలంతో పాటు భవిష్యత్తు వాటికవే ఉత్తమంగా మారిపోతాయి. ఉదాహరణకు సూర్యుడినే తీసుకుందాం. సూర్యుడు రాత్రంతా అంధకారంతో పోరాడుతుంటాడు. కానీ, ఆ విషయాన్ని మర్చిపోయి మరుసటి రోజు మళ్లీ ఉదయిస్తాడు. పూర్తి ప్రపంచానికి వెలుగునిస్తాడు. ఇదే తేడా మనిషికి, సూర్యుడికి.. గడిచిపోయిన దాన్ని వదిలేసి ముందుకు వెళుతుంటాడు సూర్యుడు.  రేపటి గురించి ఆలోచించడు. కానీ, మనిషి మాత్రం అవే నిన్నటి చేదు జ్ఞాపకాల్ని, రేపటి భయాల్ని  తనతో పాటు తీసుకెళ్తుంటాడు. అదే చేదు భావంతో, భయంతో తనని తాను నిందించుకుంటాడు. ఎప్పుడూ అవే గడిచిపోయిన మాటలకి కన్నీళ్లు పెట్టుకుంటాం. ఇవే జీవితంలో ముందుకెళ్లనివ్వవు. అన్నింటికన్నా ముఖ్యంగా ఎంతో విలువైన ఈరోజుని పట్టుకెళ్తాయి. అందుకే ఇకనైనా ఈ రోజుని ప్రేమించాలి.
ఈరోజుని వృథా చేయొద్దు
భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం అంటే ఈరోజుని వృధా చేసినట్టే. అంటే మన భవిష్యత్తు కూడా కచ్చితంగా గడిచిన కాలంగానే మారుతుంది. ఇప్పుడు అందరి మనసులో వచ్చే ప్రశ్న... ‘రేపటి గురించిన ఆలోచనలే లేకపోతే ఎలా?’ అని. ఇక్కడ సమస్య రేపటి గురించి కంటున్న కలలు కాదు...దాన్ని చేరుకోవడానికి ఈరోజు పడే భయం,  బాధ. ఇవే ఈరోజుని వృధా చేస్తున్నాయి. ఇవే ఈరోజు సంతోషాల్ని దూరం చేస్తున్నాయి. అందుకే రేపటి గురించి భయం వద్దు. ఎందుకంటే దీనివల్ల ఏం మారదు. ఆవగింజంతైనా ఏం  మారదు. అందుకే ఏదైనా కావాలనుకుంటే కష్టపడాలి. చాలా అంటే చాలా కష్టపడాలి. కానీ, ఆ కష్టానికి వచ్చే ఫలాల్ని ముందే అంచనా వేయొద్దు. దాని గురించి ఆలోచిస్తూ  ఈరోజు సంతోషాల్ని వృధాగా పోనివ్వొద్దు. ప్రతిరోజుని ఆస్వాదించాలి. వాయిదా లేకుండా మనసుకి నచ్చిన పని చేయాలి. 
కొత్త లక్ష్యంతో.. 
తప్పు అందరి వల్ల జరుగుతుంది. అందరి ప్రయాణంలో ఫెయిల్యూర్​ ఉంటుంది. అందరూ చెడు రోజులను చూస్తుంటారు. కానీ, ఈ విషయాలన్నీ మర్చిపోయి ఎప్పుడైతే జీవితంలో ముందుకు వెళ్తారో.. అప్పుడే సంతోషాలు ఎదురొస్తాయి. అప్పుడే సూర్యుడిలా అందరూ మెరుస్తారు. అప్పుడే ఈరోజుని మనసారా గడపగలుగుతారు. అందుకే నిన్నటి భయాలు, బాధలు నిన్ననే వదిలేయాలి. ఈరోజుని కొత్తగా మొదలుపెట్టాలి. ప్రతి రోజూ ఒక కొత్త ఉత్సాహంతో ..ఒక కొత్త లక్ష్యంతో ముందుకెళ్లాలి. గడిచిపోయిన చేదు జ్ఞాపకాలు బాధపెట్టడం గురించి కాదు.. కేవలం మనోధైర్యాన్ని  ఇవ్వడం కోసమే అని నమ్మాలి. మన జీవితంలో ఏ పరిస్థితుల్లో అయినా  నిన్నని ఓ గుణపాఠంలా తీసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఆ నిన్నటి బాధ జీవితంలో ఒక భాగం మాత్రమే.. అదే జీవితం కాదు అన్నది గుర్తుంచుకోవాలి. అప్పుడే ఈరోజు సంతోషంగా ఉంటుంది. 
::: మానసి