వరుసకు అన్న అయ్యే వ్యక్తితో లవ్ మ్యారెజ్..

V6 Velugu Posted on Sep 22, 2021

  • వరుసకు అన్న అయ్యే వ్యక్తితో పెళ్లి
  • అవమాన భారంతో యువతి మృతి
  • ప్రేమికుడి ఆత్మహత్యా యత్నం

ఇల్లెందు, వెలుగు: ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల విచారణలో పెండ్లి కొడుకు వరసకు అన్నయ్య​ అవుతాడని తేలడంతో అవమానభారంతో యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసిన ప్రేమికుడు సైతం పురుగుల మందు తాగి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం నెహ్రునగర్​కు చెందిన బోడ శ్వేత(23) డిగ్రీ సెకండ్ ​ఇయర్ ​చదువుతోంది. కరోనా కారణంగా కాలేజీలు బంద్​అవ్వడంతో తన అక్కతో కలిసి హైదరాబాద్​లో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో మండలంలోని  కట్టుగూడెం గ్రామానికి చెందిన గుగులోత్​ వెంకటేశ్(25)​  ప్రేమిస్తున్నానని, నీ కోసమే ఇక్కడి వచ్చానని చెప్పాడు. కులాలు ఒక్కటే కావడంతో తన ఇంటి పేరు భూక్య అని మార్చి చెప్పడంతో ఆమె నమ్మింది. వీరిద్దరూ నెల క్రితం హైదరాబాద్​లో ఫ్రెండ్స్ ​సమక్షంలో గుడిలో లవ్​మ్యారేజ్ ​చేసుకున్నారు.

పెళ్లి విషయం ఆనోట ఈనోట పడి యువతి ఇంట్లో తెలియడంతో కుటుంబసభ్యులు ఇద్దరినీ ఇంటికి తీసుకెళ్లారు. యువతి కుటుంబసభ్యులు కట్టుగూడెంలో విచారించగా అబ్బాయి అమ్మాయికి వరుసకు అన్నయ్య అవుతాడని తేలింది. దాంతో శ్వేత అవమానభారంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసి వెంకటేశ్ ​పురుగులమందు తాగి ఇంటి వెనకాలే ఉన్న వ్యవసాయ బావిలో దూకాడు. గమనించిన కుటుంబసభ్యులు ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మొరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. యువతి ఆత్మహత్య చేసుకోవడంతో  ఆమె కుటుంబసభ్యులు యువకుడి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. సీఐ రమేశ్, ఎస్సై శ్రీను సర్దిచెప్పడంతో యువతి కుటుంబసభ్యులు శాంతించారు. మృతురాలి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే హరిప్రియ పరామర్శించారు. యువతి మృతికి కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు, ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

Read More:

పోలీసుల పేర్లు మా డైరీలో రాసుకుంటాం

సొంత అన్న, మామను చంపిన వ్యక్తి

భారత్‌కు థ్యాంక్స్ చెప్పిన డబ్ల్యూహెచ్‌వో

Tagged Telangana, Khammam, Love Marriage, marriage, suicide, ellendu

Latest Videos

Subscribe Now

More News