
- నెల్లూరు జిల్లా ఉండ్రాళ్ల మండలం యల్లాపాళెం సమీపంలోని గ్రామనత్తంలో ఘటన
నెల్లూరు: ఉద్యోగం కోసం వెళ్లిన ప్రియుడు చనిపోయాడని తెలుసుకుని అతని ప్రియురాలు భరించలేకపోయింది. తీవ్ర మనోవేదనతో కుమిలిపోయిన ఆమె విషపుగుళికలు తిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా ఉండ్రాళ్ల మండలం యల్లాపాళెం సమీపంలోని గ్రామనత్తంలో జరిగింది. శనివారం జరిగిన ఘటన స్థానికంగా విషాదం రేపింది. గ్రామంలోని హరిజనవాడలో నివాసం ఉంటున్న ఉండ్రాళ్ల శ్రీకాంత్ (21), తన ఇంటికి సమీపంలోనే నివసిస్తున్న సౌమ్య(19)తో పరిచయం ప్రేమగా మారింది. చాలా కాలంగా రహస్యంగా సాగిన ప్రేమ వ్యవహారం కొద్ది రోజుల క్రితం బయటపడింది.
శ్రీకాంత్ కంటే పెద్దవాడైన అన్న ఉన్నందున అతని పెళ్లి అయిపోయే వరకు ఆగమని ఇద్దరికీ నచ్చచెప్పారు. దీనికి ఇరువురూ అంగీకరించారు. శ్రీకాంత్ కంటే పెద్దవాడైన అన్నకు పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే.. ఉపాధి కోసం శ్రీకాంత్ ఎలక్ట్రికల్ డెకరేటర్స్ వద్ద పనిచేసేవాడు. తన వృత్తి పనిలో భాగంగా ఆత్మకూరులో డెకరేషన్స్ పని రావడంతో శుక్రవారం వెళ్లి పనిచేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై చనిపోయాడు. ఊహించని ఘటనతో అతడి ప్రియురాలు సౌమ్య మనోవేదనతో కుమిలిపోయింది. నిన్న తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్న గుళికల మందు తీసుకుని అపస్మారక స్థితిలో ఉండగా కుటుంబ సభ్యులు గుర్తించి నార్తురాజుపాళెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆమె ఆస్పత్రికి చేరుకోకముందే చనిపోవడం ఇరువురి కుటుంబాల్లో విషాదంలో ముంచెత్తింది. ప్రియులు ఇద్దరి మృతదేహాలను గ్రామంలో ఒకేచోట అంత్యక్రియలు నిర్వహించారు.