బైక్​పై వస్తుండగా కెనాల్​లోకి...

బైక్​పై వస్తుండగా కెనాల్​లోకి...
  • ఈదుకుంటూ వచ్చిన యువకుడు
  • చనిపోయిన యువతి జనగామ జిల్లా జీబీ తండాలో విషాదం

పాలకుర్తి ( కొడకండ్ల), వెలుగు : ప్రేమించిన వాడి బర్త్​డే సందర్భంగా అతడితో సరదాగా గడిపి బైక్​పై వస్తుండగా కెనాల్​లోకి దూసుకెళ్లడంతో యువతి చనిపోయింది. ఈదు కుంటూ వచ్చిన యువకుడు ప్రాణాలు దక్కించుకున్నాడు. జనగామ జిల్లా కొడకండ్ల ఎస్సై కొమురెల్లి కథనం ప్రకారం..మండలంలోని జీబీ తండాకు చెందిన యువతి (17) ఇంటర్​చదువుతోంది. ఈమె, దేవరుప్పుల మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన బానోతు వెంకన్న కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. శనివారం వెంకన్నది బర్త్​డే కావడంతో గిఫ్ట్​ ఇస్తానని చెప్పింది. దీంతో సదరు యువకుడు జీబీ తండాకు రాగా, ఇద్దరూ కలిసి బైక్​పై బయటకు వెళ్లారు.

రాత్రి పూట ఆమెను ఇంట్లో దింపుదామని తీసుకుని వస్తుండగా ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో యువతి బంధువులు చూశారు. భయంతో వెంకన్న స్పీడ్​గా బండి నడపగా అదుపు తప్పి ఎస్సారెస్పీ కెనాల్​లోకి దూసుకెళ్లింది. అయితే ఈత వచ్చిన వెంకన్న బయటకు రాగా, యువతి గల్లంతయ్యింది. పోలీసులకు విషయం చెప్పగా ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. ఆదివారం ఉదయం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామ సమీపంలో శవమై కనిపించింది.