- కొంత మంది అటెండెన్స్ కోసం వచ్చి వెళ్తున్నారు
- కొన్ని సార్లు సభలో 20 మంది మాత్రమే ఉంటున్నరు
- సీఎం సీరియస్ అయినా లైట్ తీసుకుంటున్నరు
- విప్‌లు, మంత్రులురమ్మంటున్నా పట్టించుకోవట్లే
హైదరాబాద్, వెలుగు:అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కీలక దశకు చేరుకున్నాయి. సోమ, మంగళవారాల్లో బడ్జెట్ కేటాయింపులపై డిస్కషన్ జరగగా, బుధవారం నుంచి శాఖల వారీగా పద్దులపై చర్చిస్తున్నారు. కాగా, సమావేశాలు మొదలైనప్పటి నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు సమావేశాలకు డుమ్మా కొడ్తున్నారు. వచ్చినా ఇలా హాజరు పడి అలా వెళ్లిపోతున్నారు. బడ్జెట్‌లాంటి కీలక చర్చల్లోనూ పాల్గొనేందుకు సభ్యులు ఆసక్తి చూపకపోవడం చర్చనీయాంశంగా మారింది.
అసెంబ్లీలో119 మంది సభ్యులు ఉండగా, కాంగ్రెస్ నుంచి 65, బీఆర్ఎస్ 37, బీజేపీ, ఎంఐఎం నుంచి 8 చొప్పున, సీపీఐ నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. కానీ, మెజారిటీ సభ్యులు మధ్యాహ్నం12 గంటల వరకు పత్తా ఉండట్లేదు.
ఉదయం క్వశ్చన్‌అవర్ టైంలో కనీసం 20 నుంచి 30 మంది కూడా ఉండట్లేదు. దీనిపై ఇటీవల అసెంబ్లీ స్పీకర్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ నెల 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. గవర్నర్ ప్రసంగం రోజు మినహా మిగతా రోజుల్లో ఒక్కసారి కోరం కూడా ఉండట్లేదు. అధికారపార్టీ నుంచి 20 నుంచి 30 మంది కూడా అటెండ్ కావట్లేదు. బీఆర్ఎస్లోనూ పట్టుమని 10 నుంచి 15 మంది ఉండట్లేదు.
బీజేపీ, ఎంఐఎం నుంచి కూడా నలుగురైదుగురు గైర్హాజరవుతున్నారు. కొంత మంది ఎమ్మెల్యేలు క్వశ్చన్ అవర్ లో తమ ప్రశ్న వచ్చినా రావటం లేదు. ఆయా ఎమ్మెల్యేల పేర్లను పిలిచి.. వారు రాకపోవడంతో స్పీకర్ ఇతర ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తున్నారు. కొందరైతే కేవలం అటెండెన్స్ కోసం వచ్చి వెళ్తున్నారని చర్చ సాగుతోంది. మరి కొంత మంది ఎమ్మెల్యేలు లంచ్ కోసం వెళ్లి మళ్లీ తిరిగి రావటం లేదు.
అన్ని పార్టీల్లోనూ ఇదే తీరు..
ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడి వెళ్లారంటే ఆ తర్వాత సభ వైపు కన్నెత్తి చూడలేదు. జుల్ఫీకర్ అలీ సైతం సభకు రావటం లేదు. బీజేపీ నుంచి రాజాసింగ్ హాజరుకావడం లేదు. ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చినా.. బీజేపీఎల్పీ ఆఫీస్ లో కూర్చొని వెళ్లిపోయారు. ఇక బీఆర్ఎస్ నుంచి ప్రతిపక్ష నేత కేసీఆర్ రావడం లేదు. గంగుల కమలాకర్ ఒకటి రెండు సార్లు వచ్చి ఆ తర్వాత కనిపించడం లేదు. అయితే, బీఆర్ఎస్ నుంచి ప్రధానంగా కేటీఆర్, హరీశ్‌రావు మాత్రమే మాట్లాడుతుండడం, ఇతరులకు అవకాశం ఇవ్వకపోవడంతో ఎవరూ ఆసక్తిచూపడం లేదనే చర్చ జరుగుతోంది. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ సైతం సభకు అటెండ్ కావటం లేదు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభకు ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు. ఇటీవల సీఎం సీరియస్అయ్యాక ఐదుగురు విప్ లు, మంత్రులు స్వయంగా లాబీల్లోకి వచ్చి ఎమ్మెల్యేలను సభలోకి రమ్మని పదే పదే కోరుతున్నా వారిలో మార్పు రావటం లేదు. దీంతో వారిని ఎలా దారిలోకి తేవాలో అర్థం కాక విప్‌లు తలపట్టుకుంటున్నారు. అటు అధికార, ఇటు ప్రతిపక్ష సభ్యుల గైర్హాజరీ వల్ల ప్రజా సమస్యలపై ఆశించిన స్థాయిలో చర్చలు జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సీఎం సీరియస్ అయినా..
అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు సభా కార్యకలాపాల్లో పాల్గొనకుండా లాబీల్లో కబుర్లు చెప్పుకుంటూ, చిట్ చాట్ పేరుతో కాలక్షేపం చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొద్దిరోజుల కింద జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఈ అంశాన్ని ప్రస్తావించి, ఎమ్మెల్యేలకు గట్టిగానే క్లాస్ పీకారు. కీలకమైన సీఎల్పీ సమావేశానికే ఆరుగురు ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
సభకు క్రమం తప్పకుండా హాజరుకావాలని, చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని, ప్రతిపక్ష సభ్యుల విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని హితబోధ చేశారు. మహిళా శాసనసభ్యులు కూడా క్రమం తప్పకుండా వస్తూ, ప్రభుత్వ పథకాలపై జరిగే చర్చల్లో గళం విప్పాలని సీఎం సూచించారు.
