
హైదరాబాద్ లోక్ సభ పరిధి లో నమోదైన పోలింగ్ శాతంతో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఈ లోక్ సభ నియోజకవర్గంలో మలక్ పేట, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్ పురా, బహదూర్ పురా అసెంబ్లీ స్థానాలున్నాయి. మొత్తం 19,57,772ఓటర్లు ఉన్నారు. ఈసారి 8,76,078 ఓటర్లుతమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 44.75 శాతం పోలింగ్ నమోదైంది. వాస్తవానికి హైదరాబాద్ ఎంపీ స్థానం పరిధిలో మెజార్టీకి పోలింగ్ శాతమే అత్యంత కీలకం. కానీ ఈసారీ అనుకున్నంత పోలింగ్ జరగలేదు. రానురాను పోలింగ్ శాతం గణనీయంగా పడిపోతుంది. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో 52.49శాతం నమోదుకాగా, 2014లో 53.03%, 2019లో 44.75% నమోదైంది. ఈసారి 10శాతం వరకు పోలింగ్ తగ్గింది. మజ్లిస్ పార్టీకి ఈ నియోజకవర్గంపై మంచి పట్టుంది. పురుషుల ఓట్లతో పోలిస్తే మహిళలు తక్కువగానే ఓటేశారు. హైదరాబాద్ లోకసభ స్థానం నుంచి అసదుద్దీన్ కు తిరుగులేదు. ఇప్పటికే మూడుసార్లు ఎంపీగా గెలిచారు. అయితే, ఓటింగ్ పర్సంటేజీ మరింత పెరిగితే మెజార్టీ మరింత పెరగవచ్చని ఆయన భావించారు.
ఈ నేపథ్యంలోనే ఈఎన్నికలలో ఓటింగ్ పెంచడంపై ప్రత్యే క దృష్టిసారించారు. అయినప్పటికీ ఆయన ప్రయత్నం ఫలించలేదు. రాష్టంలోనే అత్యంత తక్కువ పోలింగ్ శాతం నమోదైన నియోజకవర్గంగా హైదరాబాద్ నిలిచింది. గత ఎంపీ ఎన్నికల్లో బీజేపీఅ భ్యర్థి భగవంతరావుకు మూడు లక్షలపైగా ఓట్లు పోల్ అయ్యాయి. ఈసారి కూడా ఆయనే ఈ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఓటింగ్ కనుక పునరావృతం అయితే భగవంతరావు గెలిచే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ కు ఎక్కువ ఓట్లు పోలయ్యే వీలుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఈ సెగ్మెంట్ పరిధిలో తగ్గిన పోలింగ్ తో గెలుపు అవకాశాలపై అభ్యర్థులు ఎవరి ధీమాలో వారు ఉన్నారు.