
- లోతట్టు ప్రాంతాలు జలమయం
- అలుగుపోసిన చెరువులు, కుంటలు, నీట మునిగిన పంటలు
- కొట్టుకుపోయిన రోడ్లు, రాకపోకలకు అంతరాయం
- వాగులో చిక్కుకున్న గొర్ల కాపర్లను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్
నెట్వర్క్, వెలుగు : అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి పాలమూరుజిల్లాలో ఏకధాటిగా కురిసిన వర్షంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. దీంతో చెరువులు అలుగుపోశాయి. వాగులు పొంగి, కల్వర్టుల వద్ద ప్రమాదకరంగా ప్రవహించాయి. వరద ఉధృతికి రోడ్లు కోతకు గురవగా, రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు చోట్ల వరి, పత్తి చేలు నీట మునగడంతో నష్టం వాటిల్లింది.
మహబూబ్‌నగర్ జిల్లా పొల్కంపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపర్లు వెంకటయ్య, ఆంజనేయులు, చంద్రశేఖర్, శ్రీను, తిరుపతయ్య, విష్ణువర్ధన్, పరశురాం, వంశీ, మల్లయ్య, రామచంద్రయ్య 800 గొర్రెలు, పిల్లలను తీసుకొని బుధవారం మేతకు గ్రామ సమీపంలోని అడవికి వెళ్లారు. ఊకచెట్టువాగు ఉధృతంగా పారడంతో అందులో చిక్కుకుపోయారు. బోట్ సాయంతో వారిని, గొర్రె పిల్లలను ఒడ్డుకు తీసుకొచ్చారు.
భూత్పూర్ మండలంలోని దివిటిపల్లి, నల్లకుంట, అంబటోనిపల్లి చెరువు అలుగు పారాయి. ఆ నీరంతా అమరరాజా కంపెనీకి వెళ్లే రోడ్డు కల్వర్టు వద్ద ఉధృతంగా పారడంతో రోడ్డు కొట్టుకుపోయింది. మహబూబ్‌నగర్, జడ్చర్ల నుంచి కంపెనీకి చెందిన 15 మంది ఉద్యోగులను ఎక్కించుకొని వస్తున్న బస్సు అందులో ఇరుక్కుపోయింది. క్రేన్ సాయంతో15 మందితో పాటు బస్సును బయటకు తీశారు.
కోమటికుంట చెరువు వరద తాకిడికి గండి పడి, భూత్పూర్ సమీపంలోని హైవే మీదుగా పారాయి. దీంతో మధ్యాహ్నం వరకు హైవేపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జడ్చర్ల ఫ్లై ఓవర్ వద్ద ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు వరద నీటిలో ఆగిపోయింది. బస్సులోని 40 మంది ప్రయాణికులను ఫైర్, పోలీస్‌సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్చౌహాన్, కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకి సహాయక చర్యలపై ఆరా తీశారు.
బాలానగర్ బాయ్స్ హాస్టల్, మరికల్ మండలం పస్పుల ప్రభుత్వ పాఠశాల, నర్వ మండలం కల్వాల గవర్నమెంట్ హై స్కూల్లోకి వరద నీరు చేరింది.
మహబూబ్‌నగర్‌లోని బీకేరెడ్డి కాలనీ, లక్ష్మీనగర్, శ్రీరామ కాలనీ, క్రిస్టియన్‌పల్లి, రామయ్యబౌలి, పద్మావతి కాలనీ, మర్లు, పాలకొండ, కొత్త గంజ్, బండమీదపల్లి, ఎర్రగుంట ప్రాంతాలు జలమయమయ్యాయి. బండమీదపల్లి సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్యూబీ) నీటిలో మునిగిపోయింది. ఆర్యూబీ గోడల పక్కన నిర్మించిన రెయిలింగ్ కూలిపోయింది. ధన్వాడ మండలం పాత తండా, జడ్చర్లలోని పలు కాలనీల్లోకి నీరు చేరింది. యాసాకికుంట తండాలో చెరువు కట్ట తెగి ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. మరికల్లో పెద్ద చెరువు అలుగు పారడంతో హైవే 167పై నీరు పారింది.
వర్షాలతో మక్తల్, కోస్గి, మద్దూరు, అడ్డాకుల, చిన్నచింతకుంట, మరికల్, ధన్వాడ, ఊట్కూరు, నర్వ మండలాల్లోని వాగులు ఉధృతంగా పారుతున్నాయి. మట్టి రోడ్లు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. చెరువులు అలుగు పోస్తుండటంతో దిగువన ఉన్న పంట పొలాల్లోకి భారీగా నీరు చేరింది. వరి, పత్తి చేలల్లో నీళ్లు నిలిచి రైతులకు నష్టం వాటిల్లింది.
నాగర్ కర్నూల్ జిల్లాలో దుందుభివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మిడ్జిల్, తాడూరు, కల్వకుర్తి, తెల్కపల్లి, వంగూరు, ఉప్పునుంతల మండలాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. నాగనూలు, ఎండబెట్ల వద్ద కాజ్వే దాటుతూ జారిపడి కొట్టుకుపోతున్న బైకర్లను స్థానికులు కాపాడారు. ఉమా మహేశ్వరం ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడడంతో రాకపోకలు నిలిపివేశారు. వంగూరు ఎంపీడీవో, తహసీల్దార్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. కొల్లాపూర్ ఏరియాలో వరి, పత్తి పంటలు నీట మునిగాయి.
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ, మంత్రాలయం మధ్య పోలోని వాగు మరోసారి పొంగడంతో ఓ లారీ బురదలో కూరుకుపోయింది. అలంపూర్, మానవపాడు, ఉండవెల్లి, ధరూర్, అయిజ, మల్దకల్, వడ్డేపల్లి మండలాల్లో వాగుల సమీపంలోని పంట పొలాల్లో నీరు నిలిచింది.
వనపర్తి జిల్లాలో ఊకచెట్టువాగుపై లో లెవెల్ బ్రిడ్జి మీదుగా వరద నీటి ప్రవాహంతో వనపర్తి, ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అంకూరు వద్ద కాజ్ వేపై వరద ఉధృతితో వనపర్తి,-ఖిల్లాగణపురం, -మహబూబ్‌నగర్ మధ్య వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పెద్దమందడి మండలం జంగమయ్యపల్లి రైట్ కెనాల్ కు గండి పడడంతో వరద నీరంతా పొలాల్లోకి చేరింది. కేతెపల్లి గ్రామ శివారులో భీమా కాల్వ తెగడంతో పంటలు దెబ్బతిన్నాయి. కేశంపేట, తుర్కదిన్నె, అనంతపూర్, నాగపూర్ గ్రామాల్లో వరద నీటి ప్రవాహంతో రాకపోకలు స్తంభించాయి.