
- పాలమూరులో కుండపోత
- పొంగిన వాగులు.. హైవేపైకి చేరిన వరద
- కల్వర్టులో పడ్డ బస్సు.. 15 మందిని రక్షించిన అధికారులు
- ఖమ్మంలో ఉధృతంగా మున్నేరు వాగు.. ఉమ్మడి నల్గొండలో నిండిన చెరువులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు వర్షం దంచికొట్టింది. వాగులు, చెరువులు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. దీంతో భూత్పూర్ మండలంలోని కోమటికుంట చెరువుకు గండిపడి, వరద నీరంతా ఎన్‌హెచ్ 44 పైకి చేరింది. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఈ చెరువుకు సమీపంలోని దివిటిపల్లి దగ్గరున్న అమరరాజా కంపెనీ వద్ద వరద ఉధృతికి కల్వర్ట్ సమీప రోడ్డు కొట్టుకుపోయింది. ఉదయం 5 గంటలకు కంపెనీ సిబ్బందిని తీసుకొస్తున్న బస్సు కల్వర్టులో పడిపోగా.. విపత్తు నిర్వహణ బృందాలు క్రేను సాయంతో బస్సును బయటకు తీశాయి. అందులో ఉన్న 15 మంది సురక్షితంగా బయటపడ్డారు. జడ్చర్లలోని ఫ్లై ఓవర్ వద్ద నల్లచెరువు కుంట వరదనీటిలో సికింద్రాబాద్ వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ కి చెందిన సూపర్ డీలక్స్ బస్సు చిక్కుకుపోయింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చి బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
మూసాపేట మండలం పోల్కంపల్లి వద్ద పెద్దవాగులో 10 మంది గొర్రెల కాపరులు, 800 గొర్రెలు చిక్కుకుపోయాయి. గ్రామస్తుల సమాచారంతో రెవెన్యూ ఆఫీసర్లు, పోలీసులు, ఫైర్ సిబ్బంది వాగు వద్దకు చేరుకున్నారు. వరద ఉధృతంగా పారుతుండడంతో మహబూబ్‌నగర్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించారు. వారు కాపర్లను, గొర్రెలను తాడు సాయంతో ఒడ్డుకు చేర్చారు. మహబూబ్‌నగర్ లోని బండమీదిపల్లి వద్ద ఆర్‌యూబీలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో మహబూబ్‌నగర్ పాలిటెక్నిక్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్, అడ్డాకుల, నర్వ, మరికల్, మక్తల్, ఊట్కూరు, కోస్గి, చిన్నచింతకుంట ప్రాంతాల్లో పత్తి, వరి పంటలు నీట మునిగాయి.
ఖమ్మం జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు, నదులు
ఖమ్మం జిల్లావ్యాప్తంగా భారీ వానలు కురుస్తున్నాయి. వీంతో వైరా, పాలేరు రిజర్వాయర్లు, 252 చెరువులు మత్తడి దుంకుతున్నాయి. మున్నేరు నదిలో 9.6 అడుగుల దగ్గర వరద స్థిరంగా ఉన్నది. తల్లాడ మండలం రామచంద్రాపురం, వెంకటగిరి గ్రామాల మధ్య లో లెవల్ బ్రిడ్జి పైనుంచి వాగు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాత్రంతా వర్షం కురిసింది. కొత్తగూడెంలో బుధవారం రాత్రి 7 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు భారీ వర్షం కురిసింది. రాత్రంతా వర్షం కురుస్తూనే ఉండడంతో జనాలు ఇబ్బంది పడ్డారు.
బుధవారం చండ్రుగొండ మండలం మద్దుకూరులో 12.7 సెంటీ మీటర్లు, అశ్వారావుపేటలో 10.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ వార్నింగ్‌తో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న వానలతో చెరువుల్లోకి భారీగా నీరు చేరి.. అలుగు పారాయి. హైదరాబాద్‌లో కురుస్తున్న వానలకు మూసీ ప్రవాహం పెరిగింది.
రూటు మార్చుకున్న వర్షాలు
వర్షాలు రూటు మార్చుకున్నాయి. బుధవారమంతా రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాల్లో దంచికొట్టిన వాన.. ఇప్పుడు ఉత్తరాది జిల్లాలకు షిఫ్ట్ అయ్యాయి. గురువారం ఉదయం నుంచే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. కాగా, బుధవారం రాత్రి రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్, వికారాబాద్, నారాయణపేట, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడ్డాయి. అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో 14.7 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
వికారాబాద్‌జిల్లా పరిగిలో 12.7 సెంటీ మీటర్లు, నారాయణపేట జిల్లా మరికల్లో 12.6, సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో 12.6, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో 12.3, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 12.2, వనపర్తి జిల్లా గోపాలపేటలో 10.2, ఖమ్మం జిల్లా వేంసూరులో 10.1, రంగారెడ్డి జిల్లా కొందుర్గులో 10.1 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, యాదాద్రి జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురిశాయి. ఇక, గురువారం ఉదయం నుంచి నిజామాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షం పడింది. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, గద్వాల జిల్లాల్లోనూ వర్షం కురిసింది.
2 రోజులు అతి భారీ వర్షాలు..
రాష్ట్రంలో 2 రోజులపాటు అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, మెదక్, ములుగు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్అలర్ట్ను జారీ చేసింది. ఆ తర్వాత 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఆయా రోజులకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. హైదరాబాద్‌లో 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల తీవ్రత అధికంగా ఉందని ఐఎండీ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం బలపడిన్టటు వెల్లడించింది.